సంక్రాంతి సెలవులు ఇవ్వగానే అమ్మా నాన్నతో కలసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు శ్రీకాంత్, శ్రీవల్లి. పెరట్లో పిండి వంటలు చేస్తున్న అమ్మమ్మ దగ్గరికి వెళ్లి ‘అమ్మమ్మా నాకు గారెలు చెయ్యి’ అని గోముగా అడిగింది మనవరాలు శ్రీవల్లి. ‘కనుమ నాడు గారెలు చేసుకుందాం. మూడురోజుల పండుగ కదా, భోగీ రోజున భోగి మంటల వేసుకుంటాము. పిల్లలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆరోజు సాయంత్రం భోగీ పళ్ళు (రేగు పళ్ళు) పోసుకుందాం. సంక్రాంతి రోజున పెద్దలకు మూలన బట్టలు పెడదాం. గంగిరెద్దుల వారికి, హరి దాసులకు ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దానం చేద్దాం. మీరంతా గాలి పటాలు ఎగరేస్తారు కదా!’ అని అమ్మమ్మ చెప్తూ ఉండగానే. ‘ఆ మర్నాడు మేము మా ఇంటికి వెళ్ళిపోతామా అమ్మమ్మా?’ అని అడిగింది శ్రీవల్లి.
మనవరాలు అలా అడిగేసరికి అమ్మమ్మ కళ్ళు చెమర్చాయి. ‘ఆరోజు కనుమ పండుగ. కనుమ నాడు కాకి కూడా కదలదు’ అని చెప్పింది అమ్మమ్మ. ‘నిజమేనా అమ్మమ్మా?’ అని అడిగాడు శ్రీకాంత్. ‘అలా అనకపోతే మీరు ఉండరు కదా! అయినా అది ఒక నమ్మకం. రైతులు సంవత్సరమంతా కష్టపడతారు. సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది. శారీరకంగా మానసికంగా అలసి ఉంటారు. వారికి బలం చేకూరడం కోసం, ఆరోగ్యం కోసం ‘కనుమ నాడు మినుము తినాలి’ అనే నియమం పెట్టారు. ఆరోజు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉన్న పశువులను ముస్తాబు చేసి పూజించడం ఒక ఆనవాయితీ. ఈ మూడురోజులు చుట్టాలు, స్నేహితులు ఒక చోట చేరి ఆనందంగా గడుపుతారు. కాకులకు ఆహారం పెడతారు. అందువల్ల కాకులు ఆహారం కోసం ఊరు దాటవు.’ అని వివరించింది అమ్మమ్మ.
‘భలే భలే అమ్మమ్మ దగ్గర కూచుంటే ఎన్నెన్ని కథలో’ అన్నారు మనవలు. ‘అందుకేనర్రా పండుగలకు, పబ్బాలకు పల్లెకు వస్తూ పోతూ ఉండాలి’ అంది అమ్మమ్మ.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.