భూగర్భ సాహసికులు …

ఇటీవల ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోయి, 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయినప్పుడు వారు సజీవంగా బయటపడాలని దేశమంతా కోరుకొంది. అలాంటి విపత్తు వేళ ఆ సొరంగంలోకి చొచ్చుకువెళ్లి, వారిని కాపాడడంలో కీలకపాత్ర పోషించారు వారు. పొట్టకూటికి ప్రాణాలను ఫణంగా పెట్టి, భూగర్భ ప్రాంతాల్లో పనులు నిర్వహించే ఆ సామాన్యులు ఇప్పుడు దేశం ముందు సాహసవీరులుగా నిలబడ్డారు. సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించిన ర్యాట్‌ మైనర్స్‌ ఇప్పుడు అందరి ప్రశంసలూ పొందుతున్నారు.

             ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి ఖాస్‌ ప్రాంతం వారిది. పగలు కూడా చీకటితో మూసుకుపోయిన వీధుల గుండా, భూగర్భంలో గ్యాస్‌, నీళ్లు, డ్రైనేజీ పైపుల నిర్మాణం, సొరంగాలు తవ్వడం, మరమ్మతులు చేసే పనులతోనే అక్కడి పురుషులు నిద్రలేస్తారు. అత్యంత ప్రమాదకర వాతావరణంలో ఏ విధమైన సురక్షిత సదుపాయాలు లేకుండా ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తారు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో.. ఊహించని సంఘటనగా ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదం వారిని పలకరించింది.

17 రోజులకు పైగా సొరంగంలో చిక్కుకుపోయిన 42 మంది కార్మికులని రక్షించేందుకు ఆ బస్తీ నుంచి ఓ ఐదుగురు బృందం బయల్దేరింది. ప్రాణాలకు తెగించి మరీ, కార్మికులను రక్షించిన క్షణాన సహాయక బృందాన్ని ‘ర్యాట్‌ మైనర్స్‌’ పేరుతో యావత్‌ దేశం అభినందించింది. మీడియాలో వారి గురించి వార్తలు వెల్లువెత్తాయి. నాయకులు వారికి సన్మానాలు చేసి, ఫొటోలు దిగారు.

పది రోజుల గడిచాక ఇప్పుడు వాళ్లను పలకరించే వారే లేరు. జీవితం ఎప్పటిలాగానే దయనీయంగా సాగుతోంది.

ఖజూరీ ప్రాంత నివాసి మాలిక్‌, నవంబరు 30న ఉత్తరాఖండ్‌ నుంచి బస్తీకి తిరిగివచ్చాడు. స్థానిక బిజెపి మంత్రి, ఎమ్మెల్యే, ఆ పార్టీ ఢిల్లీ ప్రెసిడెంట్‌ ఇలా ఎంతోమంది నేతలు ఘన స్వాగతం పలికారు. ‘రాజాస్‌ ఆఫ్‌ ర్యాట్‌ మైనర్స్‌’ అంటూ కీర్తించారు. మాలిక్‌ మెడలో పూలదండలు వేశారు. అతను చేసిన ఘనకార్యం గురించి మాట్లాడారు. అయితే ఏ ఒక్కరూ అతను ఎంత ప్రమాదకర పనికి పూనుకున్నాడో ప్రస్తావించలేదు. రక్షణ పరికరాలు, బీమా సౌకర్యం, ఆరోగ్య వసతులు లేని వారంతా కనీస వేతనానికి పనిచేసే దినసరి కార్మికులని ఎవరికీ గుర్తుకురాలేదు.

ఎప్పుడూ భూగర్భంలోనే …

‘మేమెప్పుడూ భూగర్భంలోనే ఉంటాం. కాబట్టి మా గురించి ఎవరికీ తెలియదు. ఈ రెస్క్యూ ఆపరేషనే మమ్మల్ని ప్రపంచానికి చూపించింది’ అని అమాయకంగా అంటున్న మాలిక్‌ ముస్లిం దళిత కమ్యూనిటీకి చెందిన వాడు. మొత్తం 12 మంది సహాయక బృందంలో బస్తీ నుండి ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చిన మరో ఏడుగురు కార్మికులు కూడా బలహీన వర్గాలకు చెందినవారే.

పెద్ద పెద్ద స్టేషన్ల కింద పనిచేస్తాం..

‘మేమంతా సొరంగం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న జనం మమ్మల్ని ‘ర్యాట్‌ మైనర్స్‌’ అని పిలిచారు. ఆ పదం మేము మొదటిసారి విన్నాం. ఆ తరువాత ఈ పది రోజులు మా జీవితం కొత్తగా అనిపించింది. నా ఫోనుకు అదే పనిగా కాల్స్‌ వచ్చేవి. మా బృందంలోని వాళ్లమంతా ఉతికిన బట్టలు వేసుకుని, తల దువ్వుకుని మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాం. మా చుట్టూ పెద్ద పెద్ద కెమెరాలు పెట్టారు. అవన్నీ మమ్మల్నే చూస్తుంటే మేం ఎటువైపు చూడాలో అర్థం కాలేదు’ అని అమాయకంగా అంటున్న మాలిక్‌, 15 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాడు. ముంబయి, రోహతక్‌, లక్నో, రాంచీ వంటి అనేక ప్రాంతాలలో భూగర్భ పనుల కోసం వెళ్లేవాడు.

యంత్రాలు, ఇంజినీర్లు, సూపర్‌వైజర్లు, కాంట్రాక్టర్ల నిలువెత్తు చక్రంలో అట్టడుగున ఉన్న కార్మికులు వీరు. ‘భూగర్భంలోకి వెళ్లాక మేము అక్కడ ఇంజినీర్లలానే ఆలోచించాలి. మా చుట్టూ ఉన్న మట్టిని అంచనా వేయాలి. ఏ పరికరంతో తవ్వితే సులువుగా ఉంటుందో ఆలోచించాలి. ఒక్కోసారి మేము వెళ్లే మార్గాలు పెద్ద పెద్ద జాతీయ రహదారుల కింద ఉంటాయి. మరోసారి రైల్వే ట్రాక్‌లు, మెట్రో స్టేషను అడుగున మేము పనిచేస్తాం’ అని తన అనుభవాలను చెబుతున్నాడు మాలిక్‌. ఇంత ప్రమాదకర పనిచేస్తే అతనికి వచ్చే రోజు కూలీ రూ.600 మాత్రమే!

రాత్రుళ్లు నిద్ర పట్టదు..

‘మాలిక్‌ పనికి వెళ్లినప్పుడల్లా నేను భయంతో రోజులు గడుపుతాను. ఈసారి కూడా ఉత్తరాఖండ్‌లో పని ఉంది వెళ్ల్లాలి అన్నప్పుడు కూడా భయపడ్డాను. అక్కడి వార్తలు తెలుసుకోవడానికి మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఫోనులో యూట్యూబ్‌ ఛానెల్స్‌ ద్వారా సమాచారం తెలుసుకునేదాన్ని. ఒకసారి పని నిమిత్తం, రోహతక్‌ వెళ్లినప్పుడు అతను చనిపోయినంత పనైంది. సొరంగం మధ్యలో విద్యుత్‌ షాక్‌ తగిలి ఆస్పత్రి పాలయ్యాడు. సంపాదించినదంతా ఆస్పత్రి బిల్లులకే ఖర్చు చేసి, ఇంటికి వచ్చాడు. డబ్బులు పోతే పోనీ, మనిషి బతికాడని సంతోషించాను. ఎప్పుడు తాను ఏ పని కోసం వెళ్లినా నేను నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతాను’ అంటోంది మాలిక్‌ భార్య.

పిల్లలకు నెలకు రూ.500 స్కూలు ఫీజు కట్టలేక ఆ కుటుంబం తమ ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడికి పంపుతోంది. భర్త తెచ్చే అరకొర ఆదాయం చాలక మాలిక్‌ భార్య ఓ బట్టల దుకాణంలో పనికి వెళుతోంది.

మొదట చూసింది నేనే..

మున్నా ఖురేషి (33), ర్యాట్‌ మైనర్ల బృందంలో కీలక సభ్యుడు. ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను మొదట చూసింది ఇతడే. తండ్రి చనిపోవడంతో ఖురేషి బడి ముఖం కూడా చూడలేదు. ఢిల్లీ వీధుల్లో చెత్త ఏరుకుని జీవించాడు. ఆ తరువాత ర్యాట్‌ మైనర్‌గా మారాడు. 2021 కోవిడ్‌ సమయంలో అతని భార్య మరణించింది. పనులతో బయటికి వెళ్లినప్పుడు పిల్లల బాధ్యత అత్తమామలు చూసుకుంటున్నారు. భద్రత లేని మైనింగ్‌ పనుల నుంచి బయటపడాలని, వేరే పనుల్లోకి వెళ్లాలని ఖురేషి, అతడి మిత్రులు భావించారు. కానీ, అది వారికి కుదరనే లేదు. అలవాటు అయిన ఈ పనికే తమకు పిలుపులు వస్తుంటాయి. కాలుష్యం పెరిగిపోతుందని ఢిల్లీ నగరంలో భూగర్భ గ్యాస్‌ పైపుల పనిని నిలుపుదల చేయడంతో వీరంతా బస్తీకే పరిమితమయ్యారు. అప్పుడే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ఫోన్లు వచ్చాయి.

రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తయ్యాక బస్తీకి తిరిగివచ్చిన ఖురేషిని, అతని బృందాన్ని స్థానిక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆహ్వానించింది. వారు చేసిన గొప్ప పనికి ఎంతో ప్రశంసించింది. స్కూలు అసెంబ్లీలో విద్యార్థులందరికీ వారిని హీరోలని పరిచయం చేసింది. పిల్లలంతా కరతాళ ధ్వనులతో ఆ బృందాన్ని అభినందించారు. ‘ఆ చప్పట్ల మధ్యే నేను ఓ కల కన్నాను.. నా పిల్లలను ఏ రోజైనా ఇక్కడ చూడగలనా’ అని అంటున్నప్పుడు ఖురేషి గొంతు జీరబోయింది. రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తయ్యాక, సహాయక బృందంలో ఒక్కొక్కరికీ రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. దాంతో పాటు ఓ పూల దండ, బొకే కూడా వారికి అందాయి. ఆ డబ్బులు, ఆ పూలు.. ఈ కీర్తి, ప్రశంసలు శాశ్వతం కావని వారికి తెలుసు. ఏ భూగర్భ చీకట్లోనో తమ బతుకులు కలిసిపోతాయని ఎవరూ వారికి చెప్పనవసరమూ లేదు.. ఇక్కడ.. రక్షించిన, రక్షించబడిన ఇద్దరివీ సమాంతర బతుకులే.. రోజూ ఇలాంటి బతుకులెన్నో, డ్రైనేజీ గుంటల్లోనో.. సొరంగ మార్గాల్లోనో.. తెల్లారిపోతుంటాయి.

➡️