దొరపురం అనే చిన్న ఊరు సిటీకి చాలా దూరంగా ఉంది. ఆ ఊళ్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. అక్కడ పోలీసు స్టేషన్ లేదు. దీంతో పోలీసులు కొన్ని రోజులకోసారి ఊరికి వచ్చి గస్తీ వేస్తూ ఉండేవారు.
పోలీసులు గస్తీ వేసిన రోజు దొంగలు ఊళ్లోకి వచ్చేవారు కాదు. ప్రతి సారీ ఇలాగే జరుగుతోంది. ఊరి వాళ్లు దాచుకున్న సొమ్ము దొంగలు దోచుకోవడం, పోలీసులకి చిక్కకుండా పారిపోవడం పరిపాటి అయ్యింది. ‘ఇలా ఇంకెన్ని రోజులు?’ అని ఊర్లో ఉన్న రాము ఓ ఉపాయం ఆలోచించాడు. పొరుగింటి వాళ్లందరినీ పిలిచి ‘ఈ రోజు రాత్రి మనకు దొంగల వల్ల ప్రమాదం ఉండొచ్చు. మనమందరం కలిసి ఉపాయంతో దొంగలను పోలీసులకు పట్టిద్దాం’ అని చెప్పాడు.
అందరూ ‘సరే’ అన్నారు. వాళ్లందరూ రాము చెప్పినట్లు ఓ ఇంట్లో తమ విలువైన వస్తువులు బంగారం, డబ్బు దాచారు. ఆ ఇంట్లోనే పెద్దలు, పిల్లలు నిద్రపోతున్నట్లు నటించారు.
రాత్రి అయింది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో కుక్క అరుపు వినిపించింది. అంతలోనే ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు! అయితే, రాము, దొంగ ఊహించని పథకం వేసాడు. రాము ఆలోచన ప్రకారం ఊరివాళ్లు ఒక గదిలో దీపం వెలిగించారు. బంగారం, డబ్బును మరో చీకటి గదిలో భద్రపర్చారు. వెలుగు ఉన్న గదిలోనే సొమ్ము ఉంటుందని దొంగలు భావించారు.
దొంగలు ఆ గదిలోకి ప్రవేశించగానే నిద్రపోతున్నట్లు నటిస్తున్న ఊరివాళ్లు, రాము కలసి వాళ్లని పట్టుకుని కర్రకి కట్టేశారు! తెల్లారేసరికి సరికి, పోలీసులు వచ్చి దొంగలను అరెస్ట్ చేశారు. అందరూ రాము తెలివిని పొగిడారు.
– నాగిళ్ళ రోహన్ ప్రథమ్,
6వ తరగతి, భాష్యం స్కూలు,
మీర్‌పేట్, హైదరాబాద్.