వెంకన్న సాయం

Apr 23,2024 04:45 #feachers, #jeevana

గుమ్ములూరులో వుంటున్న చిన్న రైతు సుబ్బయ్య. ఎరువుల కోసం పట్నం బయలుదేరాడు. దారిలో అడవిని దాటి వెళ్లాలి. అక్కడ దొంగల బెడద వుంది. దొంగల భయంతో నడుస్తున్న సుబ్బయ్యకు కాస్త దూరం వెళ్లేసరికి వెర్రి బాగుల వెంకన్న కనిపించాడు. వెంకన్న కాళ్ళు బాగున్నా, మూతి వంకర, చేతులు వంకర. దానితో అతన్ని వెర్రి బాగుల వెంకన్న అని పిలుస్తారు.
వెంకన్న ఎవరు చెప్పినా బాగా వింటాడు. ఏ పని అప్పజెప్పినా చేస్తాడు. బాగా మాట్లాడతాడు. వెంకన్నను చూడగానే ‘ఒరే వెంకన్న .. పట్నం వరకు నాకు సాయంగా వస్తావా, నీకు మంచి భోజనం పెట్టిస్తాను’ అన్నాడు సుబ్బయ్య. ‘ఓ..వస్తాను’ అన్నాడు వెంకన్న. వాడి మొలకి డబ్బుల సంచి కట్టి కనిపించకుండా వాడి చొక్కా సర్ది, ఇది ఇక్కడ వున్నట్టు ఎవరికీ చెప్పకు. పట్నం వెళ్లాక తీసుకుంటా’ అన్నాడు సుబ్బయ్య. ‘సరే అంటూ సుబ్బయ్యతో నడిచాడు వెంకన్న. కొంత దూరం పోగానే దొంగలు వాళ్ళని అటకాయించారు.
సుబ్యయ్య మీదకి దొంగలు తెగబడడం చూసిన వెంకన్న వాళ్లను ఎదిరించాడు. ‘నా మెడ మీద కూడా కత్తి పెట్టండి. నా స్నేహితుని ఒక్కడ్నే చంపేస్తే, నేను ఒంటరి అయిపోతాను’ అంటూ పదే పదే దొంగలతో కలబడ్డాడు. వెంకన్న చేష్టలకు విసుగెత్తిన దొంగలు ‘ఛీ.. పో..’ అని తిట్టి పంపేసారు. సుబ్బయ్య దగ్గర ఏమీ లేవని నిర్ధారించుకుని అతన్ని కూడా వదిలేశారు.
దొంగల బెడద నుండి తప్పించుకున్నానని ఊపిరి పీల్చుకున్న సుబ్బయ్య కాస్త దూరం వెళ్లాక వెంకన్న మీద విరుచుకుపడ్డాడు. ‘నీకేమైనా బుద్ధి ఉందా! నా మీద కత్తి పెట్టు, నన్ను చంపు’ అని పదే పదే అలా అన్నావు. వాళ్లు నిన్ను ఏమైనా చేస్తే, నీ దగ్గరికి వసే,్త నా డబ్బులన్నీ పోయేవి కదా! తెలివితక్కువ దద్దమ్మ!’ అంటూ బాగా తిట్టాడు.
‘నేను వెర్రివాడినని తెలిస్తేనే కదా వాళ్లు నన్ను వెతక్కుండా ఉంటారు. వాళ్లు నీ మీద పడగానే, నేను తప్పించుకుంటే మాత్రం, వాళ్లు నా మీద కూడా దాడి చేసేవారు. అందుకే అలా చేశాను’ అన్నాడు వెంకన్న అమాయకంగా ముఖం పెట్టి. వెంకన్న తెలివికి సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. సహాయం చేసిన వెంకన్నకి తృప్తిగా భోజనం పెట్టించి, ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి, ఎరువులతో తిరుగు ప్రయాణం అయ్యాడు.

– కూచిమంచి నాగేంద్ర,
91821 27880.

➡️