‘సైబర్‌’ నేరాలపై అప్రమత్తత అవసరం

అధునాతన టెక్నాలజీని వాడుకుంటూ నిత్యం కొత్త ఎత్తుగడలతో ఎవరూ ఊహించని విధంగా సైబర్‌ నేరగాళ్లు పంజా విరుచుకుపడుతున్నారు. డిజిటల్‌ అరెస్ట్‌, ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరుతో ఆశచూపి ఈ మోసాలకు తెగబడుతున్నారు. బాధితులు తెలుసుకునే లోపే వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టేస్తున్నారు. బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఐవిఆర్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) కాల్స్‌ ద్వారా ఎరవేసి డబ్బులు దోచేస్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో కేటుగాళ్ల పని సులువు అవుతోంది. బాధితులు కళ్లు తెరిచే సరికే డబ్బుఖాతాలు దాటిపోతోంది. తాము ఫలాన బ్యాంకు నుంచి అని వచ్చే రికార్డు వాయిస్‌తో బురిడీ కొట్టిస్తున్నారు. మన లావాదేవీలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి వచ్చే ఐవీఆర్‌ కాల్స్‌కు స్పందించకపోవటం ఉత్తమం. తాము బ్యాంకు నుంచి చేస్తున్నామని నమ్మించి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలను రాబట్టమో లేదా చెల్లింపులు చేసేలా చేస్తారు. మీ ఖాతాకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీ జరిగిందని చెబుతూ ఎరవేస్తారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఒత్తిడి చేస్తుంటారు. ఇలాంటి సమాచారం గురించి ఎవరు అడిగినా స్పందించాల్సిన అవసరం లేదు. అనుమానం వస్తే తక్షణమే సంబంధిత బ్యాంకు బ్రాంచికిగానీ, ఆ బ్యాంకు హెల్ప్‌ లైన్‌ నంబరుకు కానీ కాల్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవటం ఉత్తమం. ఏవైనా మోసపు లావాదేవీలు జరిగితే వెంటనే సంబంధిత వ్యాలెట్‌ యాప్‌లోని హెల్ప్‌ అండ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మోసం గురించి ఫిర్యాదుచేయాలి. మన ఫోన్లలోని కనిపించే అనుమానాస్పద గుర్తుతెలియని నంబర్లను బ్లాక్‌ చేస్తే ఈ తరహా మోసాల భారి నుంచి కొంతమంది వరకూ తప్పించుకోవచ్చు.

పేట్రేగుతున్న సైబర్‌ నేరాలు
పేట్రేగుతున్న సైబర్‌ నేరాలు

సైబర్‌ దొంగల సరికొత్త అవతారం
ఫోన్‌నంబర్లను సోషల్‌మీడియా వేదికల నుంచి సేకరిస్తూ పని కానిచ్చేస్తున్నారు. కొత్తగా బ్యాంకు ఖాతా ప్రారంభించినా ‘ఖాతాను తెరిచింది మీరేనా’ అయితే ‘అవును’ లేదా ‘కాదు’ అనే ఆప్సన్‌ నొక్కండి అని రికార్డ్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఇలా మాటల్లోకి దింపి ఆధార్‌, బ్యాంక్‌, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌లు ఇలా వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అందుకే ఫేస్‌బుక్‌లో వస్తున్న ప్రతి ఒక్క మెసేజ్‌కిి రిప్లై ఇవ్వకుండా ఉండటమే మంచిది.

‘సైబర్‌ సిటిజన్‌’తో రక్షణ
డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్‌టిఆర్‌ జిల్లాలో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఈ సిటిజన్‌ చార్టర్‌ అప్లికేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించటానికి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నాం. రెండునెలల్లో 2 లక్షల మందికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఇప్పటివరకూ 82 వేలమందికి అవగాహన కల్పించాం. ఇప్పటికే సైబర్‌ సోల్జర్స్‌గా 2000 మంది ఎన్‌టిఆర్‌ జిల్లా పరిధిలో పనిచేస్తున్నారు. వీరిలో విద్యార్థులు, మహిళలు, గ్రామస్థాయిలో మహిళా పోలీసులు (డబ్లుఎంఎస్‌కె), పట్టణాల్లో (ఎంఎస్‌కెలు) ఉన్నారు. వీరందరినీ 200 మంది సైబర్‌ కమాండోలు మానిటరింగ్‌ చేస్తున్నారు. ప్రతీవారంలో నాలుగురోజులపాటు విద్యాలయాలు, కళాశాలలు, యూనివర్శిటీలలో ‘సైబర్‌ నేరాలు-నియంత్రణ పద్ధతులు’పై సెమినార్లు, సదస్సులు నిర్వహిస్తున్నాం. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, వీధుల్లో ప్లెక్సీలు, బోర్డులను ఏర్పాటుచేశాం. ప్రతి సెంటరులోనూ, వీధుల్లోనూ కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నాం. దసరా నవరాత్రి ఉత్సవాల్లో కూడా భక్తులు, యాత్రికులు మోసపోకుండా దుర్గగుడి, విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు, ఇతర చారిత్రక ప్రాంతాల వద్ద కూడా 150 అవగాహన బోర్డులు ఏర్పాటుచేశాం. మైకుల ద్వారా ప్రచార కార్యక్రమాలు సైతం ఏర్పాటుచేయిస్తున్నాం. సైబర్‌ పోలీసుల వివరాలను తెలియజేస్తూ విజిటింగ్‌ కార్డులను సైతం అందజేస్తున్నాం. సైబర్‌కేటుగాళ్ల బారి నుంచి ప్రజలను రక్షించటానికి సైబర్‌ క్రైమ్‌ విభాగం ద్వారా 14 రకాల సిమిలేషన్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయించి అవగాహన పొందిన ప్రతిఒక్కరి ఫోన్‌లో దీనిని ఇన్‌స్టాల్‌ చేయిస్తున్నాం. అవగాహన పొందిన వారికి ఓ సర్టిఫికెట్‌ కూడా అందజేస్తున్నాం. చోరీకి గురైన 400 ఫోన్లను ఇటీవలే బాధితులకు అంద జేశాం. అక్టోబర్‌ నెలంతా ప్రపంచవ్యాప్తంగా (గ్లోబల్‌మంత్‌) సైబర్‌ క్రైమ్‌పై అవగాహనా కార్యక్రమాలు జరుగు తాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

  • మీకు ఎవరైనా మేము పోలీసులమంటూ పార్శిల్‌ పంపించారనీ, అందులో డ్రగ్స్‌, ఆయుధాలు ఉన్నాయంటూ కేసు నమోదుచేశామని కాల్‌ చేస్తే స్పందించొద్దు
  • తక్కువ వడ్డీకి, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా లోన్‌ ఇస్తామని చెప్పే లోన్‌ యాప్‌లను నమ్మొద్దు
  • పార్ట్‌టైమ్‌, వర్క్‌ఫ్రం హోమ్‌ అంటూ ప్రొడక్ట్స్‌, హోటళ్లకు లేటింగ్‌, లైక్స్‌ ఇవ్వటం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పే యాప్స్‌, వెబ్‌సైట్లను నమ్మొద్దు
  •  మీ పాస్‌వర్డ్‌లను అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలు కలిపి ఉండేలా బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. తరచుగా వాడుతున్న పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండండి.
  •  మీ కంప్యూటర్‌, మొబైల్‌ఫోన్‌, ఇతర పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు యాంటీవైరస్‌ ఉపయోగించి అప్‌డేట్‌ చేసి మాల్‌వేర్‌లను రానివ్వకుండా చూసుకోండి
  •  అనుమానాస్పద వీడియో కాల్స్‌, లింక్స్‌, ఎపికె ఫైల్స్‌, యాప్స్‌ మాల్స్‌, మెసేజ్‌లను తెరవడం ద్వారా మీ ఫోన్‌ సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లోకి అందించకండి.
  •  సోషల్‌ మీడియా యాప్‌లో ప్రొఫైల్‌ లాక్‌తోపాటు టు స్టెప్‌ వెరిఫికేషన్‌ పాస్వార్డ్‌లను పెట్టుకోండి. మీ వ్యక్తిగత ఫొటోలను, వీడియో, ఫొటోలను తెలియని వారికి షేర్‌ చేయొద్దు.
  • అనుమానాస్పద లింక్స్‌, ఎపికె ఫైల్స్‌ , యాప్స్‌ డౌన్‌లోడ్‌ కాకుండా మీ ఫోన్‌ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ ‘ఆన్‌’లో ఉంచండి.
  •  రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఇతర పబ్లిక్‌ స్థలాల్లో వైఫైను వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీ సొంత చార్జర్‌ను మాత్రమే వాడండి
  •  సురక్షితమైన https:// సైట్‌లను మాత్రమే ఉపయోగించండి. గుర్తింపు పొందని సైట్‌లను వాడొద్దు
  •  ఫోన్‌ పే, గూగుల్‌పే, స్కానర్‌ల ద్వారా పేమెంట్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. మీ వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాలను అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో పంచుకోకూడదు.
  •  సైబర్‌ నేరం జరిగిన వెంటనే గోల్డెన్‌అవర్‌లో 1930కి ఫిర్యాదు చేయడం, policestation/ https:// cyber crime.gov.in లో రిపోర్టు చేయాలి.
    శ్రీ ఎవరైనా ఫోన్‌పోతే వెంటనే మీ ఫోన్‌లో ఉన్న నంబరుతో అనుసంధానమైన అకౌంట్‌లను బ్లాక్‌ చేయించాలి. ఫోన్‌ గురించి CEIR పోర్టల్‌లో ఫిర్యాదుచేసి IMEIలను బ్లాక్‌ చేస్తే ఫోన్‌ను త్వరగా పొందొచ్చు.

– బి.గుణరాము, ఇన్‌స్పెక్టర్‌,
విజయవాడ సైబర్‌ పోలీస్‌స్టేషన్‌

➡️