హాయ్ ఫ్రెండ్స్,
నా పేరు ఎం.కె.ధన్విన్. 7వ తరగతి చదువుతున్నాను. మా చెల్లి ఎం.శ్రీ వైష్ణవి 6వ తరగతి చదువుతోంది. మా అమ్మ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. ఇటీవల మా అమ్మ దగ్గర చదువుకున్న స్టూడెంట్ పెళ్లికి మేము ధవళేశ్వరం వెళ్లాం. అక్కడ మేము సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట, మ్యూజియం సందర్శించాం. ఆ ఆనకట్ట గురించి అమ్మ మాకు ఎన్నో విషయాలు చెప్పింది.
గోదావరి డెల్టా పితామహుడుగా, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి, విజ్జేశ్వరం ఆనకట్ట నిర్మాణ కర్త సర్ అర్ధర్ కాటన్ గొప్పతనం, ఆనకట్ట ఆవశ్యకత గురించి మేము తెలుసుకున్నాం.
ఇప్పటి ఈ గోదావరి డెల్టా ప్రాంతంలో 1845 సంవత్సరం వరకూ అతివృష్టి, అనావృష్టితో ఆకలి చావులు ఎక్కువగా ఉండేవి. అప్పటి జిల్లా బ్రిటిష్ అధికారి ప్రజల కష్టాలను వివరిస్తూ యూకె ప్రభుత్వానికి నివేదిక పంపారు. దానికి స్పందించి బ్రిటిష్ ప్రభుత్వం గోదావరి నదిపై ఆనకట్ట కట్టటానికి అనుకూల, ప్రతికూల పరిస్థితులను అంచనా వేయడానికి ఆర్ధర్ కాటన్ అనే ఇంజనీర్‌ని నియమించింది. ఆయన గోదావరి తీర ప్రాంతాన్ని గుర్రంపై పర్యవేక్షించి ధవళేశ్వరం – విజ్జేశ్వరం మధ్య నది వెడల్పుగా ఉండటం గమనించారు. అక్కడ ఉన్న అనేక లంక ప్రాంతాలు, ఇసుక తిప్పల వల్ల నది నీటిని పక్కకు మళ్లించి, ఆనకట్ట నిర్మించవచ్చని భావించారు. అలా 1847లో కాటన్ ఆనకట్టకు శ్రీకారం చుట్టారు. కేవలం ఐదేళ్లలో అంటే 1852 నాటికి నిర్మాణం పూర్తి చేశారు. ఈ క్రమంలో కాటన్‌కి తోడు తొలి తెలుగు ఇంజనీర్ వీరం వీరన్న సహకారం అందించారు. ఆయన చేసిన సేవకు గాను వీరన్నకి బహుదూర్ బిరుదును ప్రదానం చేశారు. గోదావరి జలాలను పొలాలకు తరలించి, సస్యశ్యామలం చేసిన కాటన్ దొరని ఆ ప్రాంత వాసులు రైతు బాంధవుడుగా పిలుచుకుంటారు.
ఈ ఆనకట్ట ఆధునీకరణ 1982లో చేశారు. అప్పుడే ఇక్కడ కాటన్ పేరు మీద మ్యూజియం నిర్మించారు. ఇందులో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు, యంత్రాలను సందర్శన కోసం పెట్టారు. అవన్నీ చూస్తుంటే మాకు భలే సంతోషమేసింది. గోదావరి నది పరివాహక అందాలు బాగా ఆకట్టుకున్నాయి. జాలర్ల పడవలు, వలలు, వేట ఆడే విధానం అలా చూస్తూ ఉండిపోయాం.
– ఎం.కె.ధన్విన్, ఎం.శ్రీవైష్ణవి,
7వ తరగతి. 6వ తరగతి.