ఆశలకు రెక్కలిస్తోంది..

చదువుకోవడం చాలామంది ఆడపిల్లలకు పెద్ద కల.. దాన్ని సాకారం చేసుకోవాలని ఎన్నో కలలు కంటారు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు వాళ్లని ఆ లక్ష్యం చేరుకోనివ్వవు. అయితే కొంతమంది ఆడపిల్లలు మాత్రం తమ కల సాకారం చేసుకోవడం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబెడతారు. అనుకున్నది సాధిస్తారు. అటువంటి వారి కోవలోకే చేరుతుంది ఉత్తరప్రదేశ్‌కి చెందిన రచనాకుమారి. పదోతరగతితో చదువు ఆపేయాల్సి వచ్చినా, పెళ్లి ఒత్తిడి ఉన్నా, తను ఎక్కడా నిరుత్సాహపడలేదు. తన కాళ్ల మీద తాను నిలబడతానని ధైర్యంగా చెప్పింది. చెప్పడమే కాదు.. ఆ దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు.. తనే కాదు, తనలాంటి వాళ్లకి ఉపాధినిస్తోంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును మళ్లీ మొదలుపెట్టి, వాళ్లల్లోనూ చదువుపై ఆశలు పెంచుతోంది.

ఉత్తరప్రదేశ్‌ బహరైక జిల్లా రిసియా బ్లాక్‌ మెయిన్‌ మార్కెట్‌ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కూరగాయల షాపులు, స్వీటు షాపులు, బట్టల దుకాణాలు, కిరాణా షాపులు, సెలూన్‌లు, టైలరింగ్‌ షాపులతో వీధులన్నీ నిండిపోతాయి. అక్కడే రచనాకుమారి షాపు ఉంది. అందులో తను స్వయంగా తయారుచేసిన గోధుమ గడ్డి కళాకృతులను విక్రయిస్తుంది. మార్కెట్లో అన్ని షాపులున్నా, రచన షాపు వాటన్నింటిలో ప్రత్యేకం. చక్కటి వాక్చాతుర్యంతో, వీక్షకులను కట్టిపడేసే చిత్తరువులతో, నిండైన ఆత్మవిశ్వాసంతో రచన ఆ షాపులో ఉండడం ఆ మార్కెట్‌కే గొప్ప ఆకర్షణ.

ఐదు కిలోమీటర్ల దూరం నుండి ఉదయం వేళకే రచన షాపుకి వస్తుంది. ఆ సమయానికే ఇంట్లో పనులన్నీ చక్క బెడుతుంది. వంటపని, పాత్రలు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటివన్నీ ఇంటికి పెద్ద కూతురుగా ఆమే చేయాలి. ఆ తరువాత సైకిల్‌పై షాపుకి వస్తుంది. ఈ తెగువ, ధైర్యం చూసే ఒకప్పుడు సూటిపోటి మాటలు అన్నవారే ఇప్పుడు ఆమెను ప్రశంసిస్తున్నారు.
‘పదోతరగతి తరువాత ఇక చదివించలేమని అమ్మానాన్న చెప్పారు. దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదు. చదువు ఆపేయడం వల్ల చాలా బాధపడ్డాను. ఇంట్లో కూర్చొని ఉంటే, పెళ్లి చేసేయాలని ప్రతిపాదన తెచ్చారు. అప్పుడు చాలా భయమేసింది. నాకు చదువుకోవడం చాలా ఇష్టం. అందుకే ఇప్పుడప్పుడే పెళ్లి వద్దని చెప్పేశాను. ‘మరి ఏం చేస్తావు’ అని అడిగారు. అప్పుడే ‘అఘా ఖాన్‌ ఫౌండేషన్‌’ ఓ ప్రాజెక్టులో భాగంగా మా గ్రామానికి వచ్చింది. సంస్థ ఇచ్చిన తోడ్పాడుతో ‘ప్రాజెక్టు లెహర్‌’లో నా పేరు నమోదు చేసుకున్నాను. అక్కడే గోధుమ గడ్డితో పెయింటింగ్స్‌ వేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ కళే నా జీవితాన్ని మార్చేసింది’ అంటున్న రచన, షాపు పెట్టిన స్వల్ప కాలంలోనే విక్రయానికి పెట్టిన బొమ్మల్లో 200 వరకు అమ్మేసింది. ఆ సంతోషం ఆమె మాటల్లో ప్రతిధ్వనించింది. ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడిన రచన కాలేజీలో చేరి విద్యను కొనసాగిస్తోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది.


గోధుమ గడ్డి పెయింటింగ్స్‌ బెహరియా ప్రాంత సాంప్రదాయ కళ. గోధుమ గడ్డిని సేకరించడం దగ్గర నుండి అందమైన ఆకారాల్లో కత్తిరించడం వరకు ఎంతో నైపుణ్యం ఉండాలి. మరెంతో సమయం వెచ్చించాలి. ఈ కళలో ఆరితేరడం అంత ఆషామాషీ కాదు. చేయి తిరిగిన కళాకారులకే అది సాధ్యం. కానీ రచన, నైపుణ్యం సాధించడమే కాక, సమర్ధవంతంగా వాటిని విక్రయిస్తోంది. ఇప్పుడు రచన మరో అడుగు ముందుకేసి, తన షాపులోనే తనలాంటి వారి కోసం శిక్షణాతరగతులు నిర్వహిస్తోంది.
‘నామమాత్రపు రుసుముతో రెండు బ్యాచులుగా శిక్షణ ఇస్తున్నాను. ఇది వారికి రెండో అవకాశం లాంటిది. ఇప్పుడు నా దగ్గర 20 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా స్కూలు డ్రాపౌట్లే. 12 నుండి 17 ఏళ్ల మధ్యవయసు వారిలో కొంతమందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి’ అని రచన తన శిక్షణా తరగతుల గురించి చెబుతోంది.
‘రచన గురించి తెలుసుకునే ఇక్కడకి వచ్చాను. ఆమె నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 8వ తరగతి వరకే చదివిన నాకు పెళ్లి చేసేశారు. ఇక్కడికి వచ్చాక నెలకి రూ.5000 సంపాదిస్తున్నాను. ఈ ఆర్థిక వెసులుబాటు చదువుకోవాలనే నా కోరికను మళ్లీ చిగురింపజేసింది. అందుకే 3 కిలోమీటర్లు నడిచి మరీ ఇక్కడికి వస్తాను’ అంటోన్న పూజ లాంటి ఫాతిమా (14), ఆఫ్రీన్‌ బేగం (12), రెహానా (13), సోనీ బానో (15) వంటి వారు అక్కడ ఎంతోమంది. ఫేస్‌బుక్‌లో రచన పోస్ట్‌ చేసిన పెయింటింగ్స్‌ నచ్చి, ఆ కళను నేర్చుకోవాలని, అంజలి (14), 8 కిలోమీటర్ల దూరం నుండి మరీ నడిచి వస్తోంది. శిక్షణ తీసుకుంటున్న ఆడపిల్లలందరూ పేద కుటుంబాల వారే.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడపిల్లల చదువు ఆశను, ఆర్థిక స్వావలంబనను పునరుజ్జీవింప జేస్తున్న రచనలాంటి ఆడపిల్లలు మనచుట్టూ ఎంతోమంది. వారందరిలో రచన గొప్ప స్ఫూర్తిని నింపుతోంది.

➡️