తెలుగు నాటకంలో మహిళా దృక్పథం

Feb 10,2025 06:14 #Literature, #Women Stories

సాహిత్య అకాడమీ, ‘వేదిక’ (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనం) సంయుక్త నిర్వహణలో జనవరి 26వ తేదీ ఆదివారం ఉదయం ‘తెలుగు నాటకం- స్త్రీవాదం’పై సదస్సు పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగింది. ప్రారంభ సభ సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘం సభ్యుడు వల్లూరు శివప్రసాద్‌ స్వాగతం ఉపన్యాసంతో మొదలైంది. సభ వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్‌ బాబు అధ్యక్షతన జరిగింది.
స్త్రీవాద రచయిత్రి వోల్గా కీలకోపన్యాసం చేస్తూ … స్త్రీ చైతన్యాన్ని ఆశిస్తూ వారి సమస్యలపై వారి జీవితాలనే కేంద్రంగా చేసుకొని రచనలు జరిగాయని, గురజాడ తన కన్యాశుల్కం నాటకంలో స్త్రీల మనోభావాలకు రూపం ఇస్తూ, ప్రశ్నిస్తూ స్త్రీల గురించి అప్పటికీ సంఘంలో ఉన్న తేలిక మాటలకు భిన్నంగా పాత్రలను తీర్చిదిద్దారని వివరించారు. మధురవాణి పాత్ర ద్వారా స్త్రీ సాధికారతకు రూపం ఇచ్చారనీ, ఆ పాత్రతో పోల్చదగిన పాత్ర సృష్టి మళ్ళీ ఇంతవరకు జరగలేదని అన్నారు. ఆనాటి నాటకాల్లో స్త్రీల మధ్య సహకార భావన ఎంత అవసరమో చెప్పారని అన్నారు. సౌజన్య రావు పంతులు మధురవాణికి భగవద్గీతను ఇవ్వడం ద్వారా ‘స్వపక్షం వారైనా- అధర్మపరులైతే వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయమన్న సందేశాన్ని గురజాడ ఇచ్చారన్నారు. హిందూ కోడ్‌ బిల్‌ తయారవుతున్న నేపథ్యంలో చలం ‘విడాకులు’ నాటకం రాశారని; ఆధిపత్య భావజాలం, నాది అనే పొసెసివ్‌నెస్‌ నుంచి దూరంగా ఉండాలని ‘ఊర్వశి’ నాటకం ద్వారా చెప్పారని తెలిపారు. ఆత్రేయ నుంచి ఆకెళ్ల వరకు స్త్రీలలో వస్తున్న చైతన్య క్రమాన్ని రాస్తూ వచ్చారని అన్నారు. సాంకేతికతను, నూతన భావాలను కలిపి రాసి ప్రదర్శించగలిగేవాటికి మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. సామాజిక మార్పుకు కీలకమైన పాత్రలను రూపొందించి రాయాలంటే బాగా అధ్యయనం చేసి రాయాలని అన్నారు. ముత్తవరపు సురేష్‌ కుమార్‌ ప్రారంభ సదస్సును ముగిస్తూ మాట్లాడారు.
మొదటి సదస్సుకు అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహిస్తూ .. పురుష జననాలకు స్త్రీలే కారకులన్న ప్రాథమిక సత్యాన్ని గుర్తించి స్త్రీలను గౌరవించాలి అన్నారు. ఆహారయోగ్యమైన వాటిని గుర్తించడంలో నాగరికతారంభంలో, వేలాదిమంది స్త్రీలు మరణించారన్న సత్యాన్ని మరిచిపోరాదని అన్నారు. స్త్రీలను గౌరవించడం, సమానత్వం పాటించటం పురుషుల కనీస కర్తవ్యం అన్నారు. ‘నాటకం- స్త్రీవాదం’ అన్న అంశంపై పత్ర సమర్పణ చేస్తూ డాక్టర్‌ కందిమళ్ళ సాంబశివరావు… ‘ప్రపంచ నాటక చరిత్రలో ఎక్కడ స్త్రీ చైతన్యం కన్నువిప్పిందో చెబుతూ, నార్వేలో హెన్రిక్‌ ఇబ్సన్‌ చేసిన ‘ఏ డాల్స్‌ హౌస్‌’ నాటకం గురించి ప్రస్తావించారు. షేక్సిపియర్‌ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందినవి ఇబ్సన్‌ నాటకాలే అన్నారు. కె.వి. గోపాలస్వామి, బళ్ళారి రాఘవ, పివి రాజమన్నార్‌ … ఈ ముగ్గురు ఇబ్సన్‌ని బాగా చదివిన వారే అని అన్నారు. తప్పెవరిది?, ఏమి మగవాళ్ళు?, నిష్ఫలం నాటికల గురించి విశ్లేషించారు. స్త్రీ పాత్రను స్త్రీలే ధరించాలన్న నియమం పెట్టి బళ్ళారి రాఘవ కెవి పద్మావతితో నటింపచేశారని అన్నారు. హేతువాదం, స్త్రీవాద దృక్పథంతో నార్ల వారు ‘సీత జోస్యం’, చలం ‘సీత అగ్ని ప్రవేశం’ నాటకాలను రాశారని చెప్పారు. 1970 నుంచి ఇప్పటివరకు వచ్చిన నాటకాల్లో … మాతృస్వామ్యం, లింగ వివక్ష, ఆర్థిక అసమానతల గురించి రాసిన నాటకాల గురించి ప్రస్తావించారు. ఎన్‌.తారక రామారావు క్షమయా ధరిత్రి, ఎం.వి.ఎఎస్‌ హరనాధరావు లేడి పంజా, మార్గశీర్ష శ్వేతపత్రం, మాంగల్యానికి మరో ముడి, విజయ భాస్కర్‌ రాసిన మబ్బుల్లో బొమ్మ మొదలైన నాటకాల్లో స్త్రీల చైతన్యం వెల్లివిరిసిన పాత్రలు ఉన్నాయన్నారు. మహా శ్వేతాదేవి రాసిన ద్రౌపది నాటక దర్శకుడు కన్హయలాల్‌ ద్రౌపది పాత్రను తన భార్య చేత వేయించి పతాక సన్నివేశంలో ఆ పాత్ర నగంగా నిలబడి పురుషాధిక్యతను ప్రశ్నించడంలో చరిత్ర సృష్టించింది అన్నారు. మణిపూర్‌లో అత్యాచారానికి వ్యతిరేకంగా 12 మంది స్త్రీలు నగ ప్రదర్శన చేసిన ఘటనను ప్రస్తావిస్తూ మహిళా చైతన్యం స్త్రీని గతంలో లాగా మౌనంగా హింసను సహిస్తూ భరిస్తూ రోదిస్తూ ఉండే పాత్రలుగా కాక తీవ్ర స్వరంలో ప్రతిఘటించే క్రియాశీలక పాత్రలను రచయితలు రాశారని చెప్పారు.
తర్వాత ‘పద్య నాటకం- స్త్రీ అభ్యుదయం’ అన్న అంశంపై పత్ర సమర్పణ చేశారు డాక్టర్‌ నిభానుపూడి సుబ్బరాజు. స్త్రీ పాత్రలు లేని సాంఘిక నాటకాలు ఉన్నాయి కానీ, స్త్రీ పాత్రలేని పద్య నాటకాలు లేవన్నారు. వందేళ్ళ క్రితం వచ్చిన చింతామణి నాటకం నిషేధించబడటం గురించి ప్రస్తావిస్తూ, పద్య నాటకాల్లో స్త్రీ అభ్యుదయం ఇంకా చీకట్లోనే ఉందని అన్నారు. ‘సంస్కరణోద్యమ నాటకాలు- స్త్రీ పాత్రలు’ అన్న అంశంపై డాక్టర్‌ సిహెచ్‌.సుశీలమ్మ చాట్లాడుతూ, కన్యాశుల్కం, వరవిక్రయం, చింతామణి నాటకాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషించారు. బాల్య వివాహం, వితంతు సమస్యలు, సతీసహగమనం వంటి ఆనాటి సమస్యలను ఎత్తిచూపిన నాటకాల గురించి చెబుతూ ఆ నాటకాలను, రచన, శిల్పం, పాత్రల స్వభావాలను అర్థం చేసుకోవడానికి తప్పక చదవాలని అన్నారు.
రెండవ సదస్సుకు పిన్నమనేని మృత్యుంజయ రావు అధ్యక్షత వహిస్తూ… స్త్రీల సమస్యలన్నిటికీ మూలం సమానత్వం లేకపోవడం అని అన్నారు. ‘ఆధునిక వీధి నాటకం- స్త్రీ వికాసం’ అన్న అంశంపై దేవి పత్ర సమర్పణ చేస్తూ.. వీధి నాటకం అంటేనే సామాజిక నాటకమని పేర్కొన్నారు. ఇంతవరకు సమాజం గుర్తించని విషయాలను గుర్తింపచేయడంలో వీధి నాటకం ముందుంది అన్నారు. ‘నాటకం పురుషాధిక్యత- స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం’ అన్న అంశంపై నల్లూరి రుక్మిణి; ‘నాటకం- స్త్రీ వైవాహిక సమస్యల చిత్రణ’ అన్న అంశంపై జె. కనకదుర్గ పత్ర సమర్పణలు చేశారు.
సాహిత్య అకాడమీ నగరాలు పట్టణాల్లో సదస్సులు నిర్వహించే ఆనవాయితీకి భిన్నంగా పూర్తిగా గ్రామీణ వాతావరణం కలిగి ఉద్యమాలకు, నాటకాలకు పేరుపడ్డ యడ్లపాడులో నిర్వహించటం అభినందనీయం. సదస్సుకు పలనాడు ప్రాంతాల్లోని మహిళా ఉపాధ్యాయులు, కార్యకర్తలు, వ్యవసాయ రంగ మహిళలు ఎక్కువగా హాజరు కావడం; పత్ర సమర్పకులు విశేష అధ్యయనం, ఆలోచనాత్మక ధోరణిలో ప్రసంగించడం స్ఫూర్తిదాయకంగా ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, పాత ఒంగోలు జిల్లాలకు చెందిన తొమ్మిది నాటక పరిషత్తుల వారు ఒకే గొడుగు కింద ‘వేదిక’ పేరుతో ఐక్యంగా నిలబడి ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయం.

– మల్లేశ్వరరావు ఆకుల
94400 07374

➡️