‘కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు..
పావన నవజీవన బృందావన నిర్మాతలు
బానిస పంధాలను తలవంచి అనుకరించరు
పోనీ, అని అన్యాయపు పోకడలు సహించరు’ అన్న శ్రీశ్రీ మాటలను నేటి యువతీ యువకులు కొందరు నిజం చేస్తున్నారు. నేటి తరం సాహిత్యాన్ని పట్టించుకోవటం లేదనే వాదనను పటాపంచలు చేస్తున్నారు. భాష ఏదైనా సాహిత్య పిపాసులుగా నేటి యువతీ యువకులు ముందుకు దూసుకొస్తున్నారు. ఇలాంటి వారికి వేదికగా 35వ విజయవాడ పుస్తక మహోత్సవం (ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం) నిలిచింది. సందర్శకులతోపాటుగా బుక్‌స్టాల్స్ నిర్వహణలోనూ, రచన, ప్రచురణ ప్రక్రియల్లోనూ చాలామంది యువత చాలా స్టాళ్లల్లో కనిపిస్తున్నారు.
ఈ పుస్తక మహోత్సవంలో మొత్తంటా 270 స్టాళ్లు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల పుస్తకాల నుంచి పెద్దల వరకూ, మహిళలు, యూనివర్శిటీ, రీసెర్స్, వైద్యం, కంప్యూటర్, ఇంజనీరింగ్, ఎఐ, ఎంఐ వంటి సబ్జెక్టు, సాహిత్యం, కథలు, కవితలు, చరిత్ర, జనరల్‌నాలెజ్డ్, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పుస్తకాలు, విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఇక్కడ కొలువు తీరాయి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన పోటీపరీక్షల మెటీరియల్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఆయా స్టాళ్లలో ఎక్కువ మంది యువత కనిపిస్తుండటం ద్వారా సాహిత్యానికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనేది స్పష్టమవుతోంది.
నలుగురు యువకుల ‘కథ’
ఆకర్షణీయమైన ఉద్యోగాలను సైతం వదిలి పెట్టి ‘కథల’ ఊతంతో పాఠశాల విద్యలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు కాకినాడకు చెందిన నలుగురు యువకులు. వారే రవి, వంశీ, సిద్ధు, సుదర్శన్. విద్యారంగంపై ఆసక్తితో ఈ నలుగురు మిత్రులు కలిసి చేస్తున్న వినూత్న ప్రయత్నమే ‘టేల్స్ టు టీచ్’ అనే అంకుర సంస్థ. ‘లెర్న్ త్రూ స్టోరీస్’ అనేది వీరి నినాదం. పాఠశాల స్థాయి సబ్జెక్టులను సైతం విద్యార్థులు సులువుగా నేర్చుకునేందుకు ఉపయోగపడే కథల పుస్తకాలను వీరు రూపొందిస్తున్నారు. బట్టీ పట్టే విధానాన్ని దూరం చేయడానికి, సైన్సు, లెక్కలు, సోషల్ వంటి సబ్జెక్టుల పై పిల్లలకు ఆసక్తి పెంచడానికి, ఆయా అంశాలను కథల రూపంలో అందిస్తున్నారు. కథల ద్వారా నేర్చుకోవడం వల్ల చదివింది చాలా కాలం పాటు గుర్తుంటుందని, భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు మెరుగుపడతాయని పలు నివేదికలు కూడా తెలుపుతున్నాయి. వీరు రూపొందించిన ‘హలో డాక్టర్’, ‘ద సైంటిస్ట్ గ్రాండ్ పా’ కథల పుస్తకాలు రైటర్స్ స్టాల్ (స్టాల్ నంబర్ 43)లో ప్రదర్శన, కొనుగోలుకు ఉంచారు. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌లో విశేష ఆదరణను పొంది 600 కాపీలు అమ్ముడైన ఈ కథల పుస్తకాలు, విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో సైతం పిల్లలను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్ని చిన్ని కథల ద్వారా అత్యంత విలువైన జీవిత పాఠాలు నేర్చుకోవచ్చునని చాటిచెప్పిన ‘పంచతంత్ర’ను స్ఫూర్తిగా తీసుకుని, కథల ద్వారా సైన్స్, లెక్కలు, ఇతర క్లిష్టమైన సబ్జెక్టులను వివరిస్తున్నట్టు వారు చెబుతున్నారు. మరిన్ని కథల పుస్తకాల ద్వారా పిల్లల నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని ఈ యువకులు చెబుతున్నారు.
వంశీకృష్ణ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలోనూ, రవితేజ పోస్టల్ బ్రాంచ్‌మాస్టర్‌గానూ, సిద్ధార్థ ఇంజనీర్, సుదర్శన్ అరబిందో ఫార్మాలో రీసెర్స్ విభాగంలో పనిచేశారు. సాహిత్యంపై తమకున్న అభిమానంతో తమ ఉద్యోగాలను వదిలి, సాహిత్యరంగంలోకి అడుగుపెట్టారు.
ది గ్రేట్ ఇండియన్ ట్రెజర్, ది ఐడియా రిజల్యూషన్‌కు ఆదరణ
హైదరాబాద్‌కు చెందిన రఘునందన్ వడ్ల టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆయన రాసిన ది గ్రేట్ ఇండియన్ ట్రెజర్, ది ఐడియా రిజల్యూషన్ పుస్తకాలు పుస్తక మహోత్సవంలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం పరిణామాల్లోనూ నేటి యువత స్ఫూర్తిపొందటానికి ఎలా ప్రేరణ పొందాలో ఈ పుస్తకాల్లో ప్రేరణాత్మకమైన కథలుగా మలిచారు.
రైటర్స్ స్టాల్‌లో సరికొత్తగా…
42 నుంచి 43 వరకూ ఉన్న స్టాళ్లలో రచయితలు రాసిన పుస్తకాలను వారే విక్రయించుకుంటున్నారు. 56 మంది రచయితల పుస్తకాలను ఈ స్టాళ్లలో ఉంచారు. రచయితలే స్వయంగా సందర్శకులకు తమ పుస్తకాల గురించి వివరిస్తున్నారు. అక్కడికి వచ్చే రచయితలు, కవులు, కళాకారులు వారితో ఫొటోలు దిగి కరచాలనాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, ఈ స్టాల్‌ను సమన్వయం చేస్తున్నారు. 157వ స్టాల్‌లో అజూ పబ్లిషర్స్ ప్రచురించిన ‘అమ్మడైరీలోని కొన్ని పేజీలు’ నవల విరివిగా అమ్ముడవుతోంది.
రాజ్యాంగం, అంబేద్కర్, కారల్‌మార్క్స్ పుస్తకాలకు ఆదరణ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే కుతంత్రాలు పన్నుతున్న వేళ, ఈ పుస్తక మహోత్సవంలో భారత రాజ్యాంగం, రాజ్యాంగ పీఠికలు, చట్టాలు తదితర పుస్తకాలకు ఎక్కువగా ఆదరణ కనిపిస్తోంది. సందర్శకులు ఎక్కువగా ఈ తరహా పుస్తకాలు, వాటికి సంబంధించిన లేటెస్ట్ బుక్స్, విమర్శనా గ్రంథాలను సైతం కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన ఇతర పుస్తకాలకు, కారల్‌మార్క్స్ రచనలకు ఈ పుస్తక మహోత్సవంలో ఆదరణ కనిపిస్తోంది. 40 ఏళ్లు దాటని యువతీ యువకులు తాజాగా రాసిన దాదాపు వంద కథ, నవల, కవితా సంపుటాలు ఈ ఫెస్టివల్‌లో లభ్యమవుతున్నాయి. సందర్శకుల్లోనూ పెద్ద సంఖ్యలో యువతీ యువకులు. పిల్లలను వెంట తీసుకొస్తున్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు.
– యడవల్లి శ్రీనివాసరావు