
గుజరాత్ : గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాపి నదికి భారీగా వరద నీరు చేరడంతో ఉకై డ్యాం 15గేట్లను ఎత్తివేశారు. దీంతో లక్ష 98వేల క్యూసెక్కుల నీరుని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో పలు గ్రామాలు నీట మునిగాయని తెలిపారు. ఈ భారీ వర్షాలతో నర్మదా నది పోటెత్తింది. దీంతో ఇళ్ళలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు తడిచి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. వరద ప్రవాహం స్థానిక రైలు వంతెనకు సమీపంగా ప్రవహించడంతో స్థానిక అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సర్దార్ సరోవర్ నర్మదా డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. స్టాట్యూ ఆఫ్ యునిటీని తాకుతూ నర్మదా నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. భారీ వర్షాలతో బరూచ్ పట్టణం నీట మునిగింది. రాజస్తాన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.