
- 86 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు అస్వస్థత
ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం ఎస్‌ఆర్‌ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఫుడ్‌పాయిజన్ కలకలం రేగింది. హాస్టల్‌లో మంగళవారం రాత్రి భోజనం తిన్న 86 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రుకు తరలించారు. ఇందుకు సంబంధించి బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు... ఎస్‌ఆర్‌ఐటి ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విద్యార్థులు ఎగ్‌రైస్, టమోటా రైస్, పెరుగన్నం తిన్నారు. అనంతరం హాస్టల్ గదులకు వెళ్లి నిద్రించారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. 86 మంది అస్వస్థతకు గురయ్యారు. తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం తెలియజేశారు. కళాశాల యాజమాన్యం, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ యుగంధర్ అక్కడికి చేరుకుని పరిస్థితి తీవ్రంగా ఉన్న 26 మందిని అనంతపురంలోని అమరావతి హాస్పిటల్‌కు తరలించారు. మరో 60 మందికి కొర్రపాడు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఐటి కళాశాలలోనే చికిత్స అందించారు. కళాశాలలో మొత్తం 586 మంది ఉండగా వారిలో 86 మంది అస్వస్థతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అనంతరం విద్యార్థులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఫుడ్‌పాయిజన్ విషయం తెలుసుకున్న డిఎంహెచ్‌ఒ వీరబ్బాయి, డిఇఒ సాయిరాంతో పాటు ఐసిడిఎస్, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు కళాశాలను సందర్శించారు. కళాశాల వంటగది, రాత్రి తిన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహార పదార్థాల శాంపుల్స్‌ను ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.