Sep 22,2022 13:15

ప్రజాశక్తి-ఓబుళదేవరచెరువు : కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండల పరిధిలోని మిట్టపల్లి బిసి బాలుర వసతి గృహంలో గురువారం చోటు చేసుకుంది. ఉదయం అల్పాహారం తిన్న అనంతరం దాదాపు 25 మంది విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు. పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే వీరంతా తీవ్ర కడుపునొప్పితో వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ప్రధానోపాధ్యాయులు స్వరూపరాణి మండల వైద్యాధికారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వైద్యాధికారి భానుప్రకాష్‌ నాయక్‌, ఎంపిడిఒ పోలప్ప తన సిబ్బందితో కలిసి పాఠశాలలోనే విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు. కడుపునొప్పి ఎక్కువగా ఉన్న 10 మంది విద్యార్థులను కదిరి, ఓబుళదేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అల్పాహారంలో తిన్న కేసరీబాత్‌కు వాడిన రవ్వ నాణ్యతగా లేకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు. కాగ ఈ ఘటనకు హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యమే కారణం అని తక్షణం ఆయన్ను సస్పెండ్‌ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు.

hospital