
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకొని గురువారం తిరివచ్చారు. రాబోయే మరో 40 రోజుల్లో అమెరికాతో సహా పలు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. కానీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ప్రధాని హోదాలో మోడీ చేస్తున్న విదేశీ పర్యటనలు గమనిస్తే ఇంట ఓడినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నప్పుడల్లా గోడీ మీడియా బాకాల సహకారంతో 'బయట భళా' అనిపించుకోవడం రివాజుగా మారింది. ప్రస్తుతం దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం కోరలు చాచి అంతకంతకూ విస్తరిస్తోంది. ద్రవ్యోల్బణం రంకెలేస్తోంది. బేటీ బచావో..బేటీ పడావో నినాదాలను అవహేళన చేసేలా అధికార బిజెపి నేతలే అత్యాచారాలకు ఓడిగడుతున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ క్రీడాకారులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ జంతర్‌మంతర్ వద్ద ప్రఖ్యాత రెజ్లర్లు నిరవధిక ఆందోళన చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో మతవిద్వేషాలు రాజేసి లబ్ది పొందాలని చూసినా.. అక్కడి ఓటర్లు కొర్రు కాల్చి వాతపెట్టడంతో బిజెపి దిమ్మ తిరిగింది. నూతన పార్లమెంటు భవన సముదాయానికి ఆహ్వానించకుండా తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోడీ సర్కార్ అవమానిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే బహిష్కరించాయి. వరుసగా చుట్టుముట్టిన ఈ ఇబ్బందులు, పరాభవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించి 'లోకనాయకుడి'గా టామ్‌టామ్ లేసుకునేందుకు మోడీ తన విదేశీ పర్యటనలను రూపొందించినట్లు ఆయన పర్యటనల తీరు చూస్తుంటే తెలిసిపోతోంది.
దేశాభివృద్ధి కోసం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తప్పనిసరి. దేశాధినేతల పర్యటనలు ఇందుకు దోహదం చేస్తాయి. కానీ ఇరుగుపొరుగు దేశాలతో మైత్రిని పెంపొందించుకొని బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకునేలా దౌత్యనీతిని, విదేశాంగ విధానాలను మలచుకోవడం సార్వభౌమత్వం కలిగిన ఏ దేశమైనా చేసే పని. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ఏ దేశానికి వెళ్లినా భారీ సభలు నిర్వహించడం, ప్రవాస భారతీయులతో వేడుకులు జరుపుకోవడం ఆయన పర్యటనలో తప్పనిసరి. తాజా విదేశీ పర్యటనల్లోనూ అదే తీరు. జపాన్ ఆహ్వానంతో జి7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకావడం, చైనాకు వ్యతిరేకంగా ఆ దేశాలు చేసిన తీర్మాణానికి ఔననలేక కాదనలేక ఇబ్బందులు పడటం చూశాం. అక్కడితో మోడీ తన పర్యటనను సరిపెట్టివుంటే పెద్ద చర్చనీయాంశం అయ్యేది కాదు. జి7 సమావేశాల తర్వాత పపువా న్యూగినియాకు వెళ్లి అక్కడ జరిగిన భారత్-పసిఫిక్ దీవుల దేశాధినేతల సమావేశంలోనూ మోడీ పాలుపంచుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి పపువా న్యూగినియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే మోడీ ఈ దేశాన్ని సందర్శించడంలో ఉద్దేశం తెలియనదేమీ కాదు.
చైనాకు పక్కలో బల్లెంలా నాటో అనుబంధ సైనిక కూటమి తయారీ లక్ష్యంగా అమెరికా రూపొందించిన వ్యూహంలో భాగమే ఇది. చతుష్టీయ కూటమి (క్వాడ్) దేశాల సమావేశం రద్దు అయినా అమెరికా నిర్దేశించిన లక్ష్యాన్ని మోడీ భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. కోవిడ్ వైరస్ సృష్టించి ప్రపంచాన్ని చైనా నాశనం చేస్తోందంటూ మహమ్మారి విజృంభణ సమయంలో అమెరికా చేసిన దుష్ప్రాచారానికి వంత పాడిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. మోడీ పర్యటనకు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అమితానందంతో స్వాగతం పలికారు. 'బాస్' అంటూ కీర్తించారు. మోడీ సన్నిహితుడు గౌతమ్ అదానీకి విద్యుత్ ప్రాజెక్టులను ఆస్ట్రేలియాలో కట్టబెట్టడం, పర్యావరణం నాశనమవుతోందని అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలిపినా మునుపటి మోరిసన్ సర్కార్ అదానీ సేవలో తరించడం, ఇప్పుడు ఆయన వారసడు మోడీకి ఘన స్వాగతం పలికారా? అమెరికాకు అంటకాగుతూ కొనీ మిత్రుల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకే మోడీ విదేశీ పర్యటనలు అని ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది.