Sep 21,2022 14:32

న్యూఢిల్లీ  :  రైల్వే ప్రయాణాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే రాయితీల్లో భారీ కుంభకోణం జరిగింది. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే ప్రత్యేక రాయితీల దుర్వినియోగం జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2019 నివేదిక వెల్లడించింది. కాగ్‌ స్పష్టం చేసినప్పటికీ.. ఈ కుంభకోణంపై సమాచారమిచ్చేందుకు భారతీయ రైల్వే, హోం మంత్రిత్వ శాఖలు తిరస్కరించాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద సమాచారాన్ని కోరినప్పటికీ .. పిటిషన్‌లోనే తప్పులున్నాయంటూ ముప్పతిప్పలు పెట్టాయి. సమాచార హక్కు (ఆర్‌టిఐ) కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌కు కేంద్ర సమాచార కమిషన్‌ (సిఐసి) చీఫ్‌ కూడా సమాచారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు యత్నించడం గమనార్హం.

జులై 15, 2017 మరియు మార్చి 31, 2018 మధ్య రైలు ప్రయాణానికి ప్రత్యేక స్వాతంత్య్ర సమర యోధుల రాయితీలను పొందిన వ్యక్తుల్లో 21 శాతం మంది ఉన్నారని డిసెంబర్‌ 9, 2019న పార్లమెంటులో అప్పటి కాగ్‌ అధికారి రాజీవ్‌ మెహ్రిషీ ఓ నివేదికను సమర్పించారు. వీరంతా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టినవారని, 70ఏళ్ల కంటే తక్కువ వయసువారని పేర్కొన్నారు. రెండేళ్ల కాలంలో 87,584 మంది ప్రయాణికులు ఈ పథకం కింద ప్రత్యేక రాయితీ పొందేందుకు ఈ పథకాన్ని దుర్వినియోగం చేశారని, రాయితీ మొత్తం రూ.1,041.86 కోట్లని పేర్కొన్నారు. 62,528 మంది ప్రయాణికులు... సహచరులు, కుటుంబసభ్యుల పేరుతో ప్రయాణించారని, 2015 మరియు 2018 మధ్య 763.58 కోట్ల రాయితీని పొందారని ఆ నివేదిక పేర్కొంది.

1947 తర్వాత జన్మించిన 1,302 మంది పురుషులు, 1,898 మంది మహిళా ప్రయాణికులకు స్వాతంత్య్ర సమరయోధుల రాయితీ కింద ఉచిత ప్రయాణాన్ని అనుమతించినట్లు కాగ్‌ పేర్కొంది. వీరిలో సీనియర్‌ సిటిజన్‌ కేటగిరీ కన్నా తక్కువ వయస్సు ఉన్న వారు 1,096 మంది పురుషులు కాగా, 580 మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. పదేళ్ల బాలుడికి కూడా ఫ్రీడమ్‌ కోడ్‌తో రాయితీని అందించడం గమనార్హం. 15 సందర్భాల్లో స్వాతంత్య్ర సమరయోధుల రాయితీ టిక్కెట్లను స్వాతంత్య్ర సమరయోధుడు పాస్‌ నంబర్‌ 0గానే ఉంచి కూడా  జారీ చేసినట్లు తెలిపింది. ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌లో స్వాతంత్య్ర సమరయోధుల వయస్సును ధృవీకరించేందుకు తగిన ఇన్‌పుట్‌ నియంత్రణ లేదని, స్వాతంత్య్ర సమరయోధుల పాస్‌ నెంబర్‌తో ఎవరికైనా టికెట్‌ను జారీ చేసి రాయితీని అందిస్తోందని తెలిపింది.

ఈ అంశంపై వివరణ కోరుతూ.. ఆర్‌టిఐ కార్యకర్త నవీన్‌ కుమార్‌ 2020, అక్టోబర్‌ 15న కాగ్‌కి ఒక దరఖాస్తును దాఖలు చేశారు. కాగ్‌ నివేదికను రాష్ట్రపతి, ప్రధాని, ఇతరులకు ఎప్పుడు పంపారు. దానిపై తీసుకున్న చర్యలతో సహా ఐదు అంశాలపై సమాచారం అందించాల్సిందిగా కుమార్‌ ఆ దరఖాస్తులో కోరారు.  అక్టోబర్‌ 28న కాగ్‌ ఈ దరఖాస్తును హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ)లోని  స్వాతంత్య్ర సమరయోధులు మరియు పునరావాసం (ఎఫ్‌ఎఫ్‌ఆర్‌) విభాగానికి బదిలీ చేసింది. అదే ఏడాది నవంబర్‌ 26న ఎంహెచ్‌ఎ ఆ దరఖాస్తుని రైల్వే బోర్డ్‌కి బదిలీ చేసింది. కొంతమంది ఎఫ్‌ఎఫ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కాగ్‌ నివేదికను తప్పుపట్టారని, అది అబద్ధమని చెప్పారని నవీన్‌ కుమార్‌ తెలిపారు. దరఖాస్తుదారుడు కోరిన అంశంపై స్పష్టత లేదని ఎంహెచ్‌ఎ అధికారులు తిరస్కరించారని అన్నారు. ఎంహెచ్‌ఎ నుండి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో కుమార్‌ 2021 ఏప్రిల్‌ 20న సిఐసికి రెండోసారి దరఖాస్తు చేశారు.

2022 సెప్టెంబర్‌ 6న రైల్వే మంత్రిత్వ శాఖలోని పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (పిఐఒ) నుండి సిఐసి రాతపూర్వక సమాధానాన్ని అందుకుంది. ఈ అంశాలు తమ పరిధికి సంబంధించినవి కావని అందులో  పేర్కొంది. అలాగే ఆర్‌టిఐ కార్యకర్త తన దరఖాస్తులో కోరింది స్వాతంత్య్ర సమరయోధుల రైల్వే పాస్‌ల గురించిన  సమాచారాన్ని కాదని వెల్లడించింది.  2022 సెప్టెంబర్‌ 12న నవీన్‌ కుమార్‌ ఆర్‌టిఐ దరఖాస్తు హక్కుని దుర్వినియోగం చేస్తున్నారని, ఇదే అంశంపై సిఐసికి పదేపదే దరఖాస్తులు దాఖలు చేస్తూ సమయాన్ని  వృధా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  నవీన్‌ కుమార్‌ నుండి ఈ అంశంపై మరే దరఖాస్తు స్వీకరించకూడదని  స్పష్టం చేస్తూ  సిఐసి చీఫ్‌ వై.కె. సిన్హా, ఎంహెచ్‌ఎ శాఖలు ఆయన  అప్పీల్‌ను కొట్టివేశాయి.