Nov 24,2022 07:30

వాషింగ్టన్‌ : భారత్‌లో మతస్వేచ్ఛ, అందుకు సంబంధించిన మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్‌ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) పేర్కొంది. భారతదేశంలో మత స్వేచ్ఛకు సంబంధించి వార్షిక మదింపు నివేదికను కమిషన్‌ మంగళవారం వెలువరించింది. గతంలో ఈ కమిషన్‌ వ్యాఖ్యలను, పరిశీలనలను భారత్‌ తిరస్కరించింది. భారత్‌ను ఆందోళనకరమైన దేశంగా భావించాల్సి వుందంటూ ఈ ఏడాది ప్రారంభంలో కమిషన్‌ తన నివేదికలో సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును అమలు చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ తిరస్కరించింది. ఈ ఏడాది ప్రారంభంలో చేసిన సిఫార్సులను తాజాపరుస్తూ మంగళవారం మరో నివేదిక వెలువరించింది. భారత్‌లో మతస్వేచ్ఛ పరిస్థితులు చాలా పేలవంగా వున్నాయని 2022నాటి నివేదికలో కమిషన్‌ పేర్కొంది. నిర్దిష్ట గ్రూపులను లక్ష్యంగా చేసుకుని విధానాలు రూపొందిస్తున్నారు, చట్టాలు చేస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా మతపరమైన మైనారిటీల గొంతులను నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.