Jan 25,2023 00:15

చేపల షికారు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం
మండలంలోని గిరి పల్లెల్లో చేపల షికారు జోరుగా సాగుతోంది. వేసవి ప్రారంభానికి ముందు వ్యవసాయ చెరువుల్లో గిరిపుత్రులు సంప్రదాయ బద్ధంగా వెదురు బుట్టలు, వెదురు బొంగు దింపుడు వలలతో చెరువుల్లో చేపల షికారు చేస్తూ ఉంటారు. మంగళవారం విఆర్‌.పురం వారాంతపు సంత సముదాయం పక్కనే ఉన్న చెరువులో గిరిజనులు పెద్ద సంఖ్యలో చేపల షికారు చేశారు. గోదావరి వరదల సందర్భంలో గోదావరి నది నుండి చేపలు ఈ చెరువుల్లోకి పెద్ద సంఖ్యలో చేరాయి. దీంతో చేపల షికారు చేసిన గిరిజనులకు పెద్ద మొత్తంలో చేపలు దొరికాయి. ఊర్లకు ఊర్లుగా తరలివెళ్ళి చేపల షికారు చేశారు. చేపల షికారు దృశ్యాలు ఆసాంతం పండుగ వాతావరణాన్ని తలపించాయి.
చేపల షికారుకు గిరిజనుల ప్రాధాన్యత
మన్యంలోని గిరిజనులు పండుగలు, పబ్బాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, చేపల షికారుకు సైతం అంతే ప్రాధాన్యత ఇస్తారు. వ్యవసాయ చెరువుల్లో చేసే చేపల షికారులో చాలా నిబంధనలు పాటిస్తారు. చెరువుల్లో చేపల షికారు చేయాలని భావించినప్పుడు, చుట్టు పక్కల గ్రామాల కుల పెద్దలు, చెరువుకు సంబంధించిన గ్రామ పెద్దతో చర్చిస్తారు. వీరంతా ఫలానా రోజు ఏ చెరువులో షికారు చేయాలో నిర్ణయించుకొని, తమ గ్రామాల్లోని ప్రజలకు సమాచారం ఇస్తారు. ఇలా అందురూ కలిసి పెద్ద సంఖ్యలో చెరువుల వద్దకు చేరుకొని చేపల షికారు చేస్తారు. ఈ షికారులో దొరికిన చేపలను అంతా సమానంగా పంచుకొని ఆరగించి, ఎనలేని ఆనందం, అనుభూతిని పొందుతారు. తరాలు మారినా, మన్యంలోని గిరిపుత్రులు పండుగలు, పబ్బాలు, వేట, చేపల షికారు లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వీటి నిర్వహణ ద్వారా వారిలోని ఐకమత్యాన్ని చాటి చెబుతారు.