Aug 10,2022 00:08
ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్‌ రవి, జెసి కల్పనాకుమారి

ప్రజాశక్తి-అనకాపల్లి
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి అన్నారు. స్థానిక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి ఆదివాసీ దినోత్సవాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల సంపూర్ణ సాధనకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. తాను రంపచోడవరం, పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. గిరిజన సమాజం నుండి తాను ప్రేరణ పొందినట్లు చెప్పారు. జెసి కల్పనా కుమారి మాట్లాడుతూ గిరిజన యువత తమ సంస్కృతి సంప్రదాయాలను మరచిపోరాదన్నారు. ముందుగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే కళలను గిరిజన ఆశ్రమ పాఠశాలలు విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా థింసా నృత్యం, అల్లూరి సీతారామరాజు వేషాలు వంటివి అందర్నీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బివి సత్యవతి, కార్పొరేటర్‌ పీలా లక్ష్మీ సౌజన్య, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శిరీష, తుమ్మపాల గ్రామ సర్పంచ్‌ తట్ట పెంటయ్య నాయుడు, గిరిజన ఆశ్రమ పాఠశాల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.