May 17,2022 22:17

మాట్లాడుతున్న రవిబాబు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి/టెక్కలి రూరల్‌: గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల కు హక్కు కల్పిస్తామని ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు అన్నారు. జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి, మందస, టెక్కలిలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసుల పరిరక్షణకు సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎస్‌టి కమిషన్‌ ఏర్పాటు చేశారని అన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యను సిఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడికీ పోడు పట్టాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలువురి నుంచి వినతులు స్వీకరించారు. టెక్కలి మండలంలో లింగాల వలసల పంచాయతీ సన్యాసిపేటలో సుమారు నలభై సంవత్సరాల నుంచి 17.50 ఎకరాల భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆదివాసుల కు నష్టం జరుగుతోందని రైతులు చెప్పారు. ఈ సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లి మూడు నెలల్లో పరిష్కారం చేపడతామని హామీఇచ్చారు. ఆదివాసుల కోసం అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నా, ఆశించిన స్థాయిలో అదివాసు లు అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను ఎవరైనా ఆక్రమించి కొనుగోలు చేస్తే చట్ట పరమైన చర్యలు చేపడతా మని హెచ్చరించారు. అనంతరం గిరిజన సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. అంతకుముందు గిరిజన సంప్రదాయ నృత్యాలతో గ్రామస్తులు ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో సీతంపేట ఐటిడిఎ పిఒ బి.నవ్య, ఆర్‌డిఒ హనుమంతు వెంకట జయరాం, తహశీల్దార్‌ బెండి గిరి, జెడ్‌పిటిసి దువ్వాడ వాణి, మాజీ మండల అధ్యక్షులు సంపతరావు రాఘవరావు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.