Jan 31,2023 23:40

- సచివాలయం వద్ద మాట్లాడుతున్న సిపిఎం, గిరిజన సంఘం నాయకులు

ప్రజాశక్తి-మారేడుమిల్లి
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గిరిజనులకు సచివాలయ సేవలు సకాలంలో అందడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మట్ల వాణిశ్రీ అన్నారు. మండలంలోని వై.రామవరం మండలం, చింతలపూడి గ్రామ సచివాలయాన్ని సిపిఎం, గిరిజన సంఘం నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ ప్రమాదానికి గురైన భీములుగడ్డ గ్రామానికి చెందిన 8 సంవత్సరాల బాబుకి ఆపరేషన్‌ నిమిత్తం ఆరోగ్య శ్రీ కార్డులో పేరు నమోదు కొరకు చింతలపూడి గ్రామ సచివాలయం, ఐటిడిఎ చుట్టూ బాధితుడు తండ్రి కత్తుల లచ్చిరెడ్డి జనవరి-9 నుండి నేటి వరకు తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. సొంతంగా ఆపరేషన్‌ చేయించుకొనే ఆర్థిక స్థోమత లేదని, ఆపరేషన్‌ జరగక పోతే బాలుడు కాలు కుంటుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే ఆరోగ్య శ్రీలో పేరు నమోదు చేసి, ఆపరేషన్‌ జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
చింతలపూడి సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, దీని వల్ల అత్యవసర సేవలు పొందాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సరైన సందర్శనలు చేయకపోవడం వల్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారన్నారు. ఇలాంటి సచివాలయ సిబ్బందిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సచివాలయాలలో ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగ్గా పనిచేయటం లేదని, రిపేర్‌ వస్తే 2 నుండి 3 వారాల పాటు ఇంటర్నెట్‌ లేక సచివాలయ ఉద్యోగులు సేవలు నిలిపివేస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందికి కూడా మౌలిక వసతులు లేకపోవడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సచివాలయాల్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, సీపీఎం మండల నాయకులు కత్తుల గంగిరెడ్డి, ఈతపల్లి ఆది రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.