Jun 23,2021 16:36

లక్నో : యుపిలోని ముజఫర్‌ నగర్‌లో గంగా నదికి చెందిన కాలువలో పూడికతీత పనులు చేపడుతుండగా.. రెండు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం కావడంతో కాలువలో నీటి పూర్తి సామర్థ్యానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు పూడికతీత పనులు చేపడుతున్నామని.. ఈ పనుల్లో భాగంగా ఒక కారును వెలికితీశామని చెప్పారు. కారు వెనుక సీటులో ఒక మృతదేహం ఉందని, అక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో మరో మృతదేహం లభించినట్లు వెల్లడించారు. ఆ మృతదేహాలను గుర్తించామని, కుటుంబసభ్యులకు తెలిపామని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, వీరిద్దరూ రెండు నెలల వ్యవధిలో కనిపించకుండా పోయినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారని, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఫోలీస్‌ హిమాన్షు గౌరవ్‌ తెలిపారు. జనవరి నెలలో అదృశ్యమైన దిల్షాద్‌ అన్సారీ (27)మృతదేహం కారు వెనక సీటులో లభించగా, మరో మృతదేహం హరేంద్ర దత్‌ ఆత్రేదని,. అతను కూడా ఫిబ్రవరిలో అదృశ్యమైనట్లు తెలిపారు. కారులో దొరికిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ముజఫర్‌ నగర్‌లోని భాంగ్రా ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని.. ఆ వ్యక్తి దిల్షాద్‌ అన్సారీ స్నేహితుడని సంబంధిత వర్గాలు తెలిపాయి.