
జనవరి 19...దేశ ఆర్థిక వ్యవస్థలో, మరీ ముఖ్యంగా భారతీయ జీవిత బీమా వ్యాపార రంగంలో కీలకమైన రోజు. 245 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల నుండి ప్రీమియం రూపంలో వసూలు చేసిన మొత్తాలను తమ స్వంత ప్రయోజనాలకు వాడుకుంటూ పట్టాదారులను మోసం చేస్తున్న నేపథ్యంలో అన్ని ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలను కలిపి భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేస్తూ ఆర్డినెన్సును జారీ చేసిన రోజు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ లక్ష్యాలతో అయితే భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి ''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా''గా ఏర్పాటు చేయటం జరిగిందో ఆ జాతీయీకరణ లక్ష్యాలను సాధించటంలో ఎల్ఐసి కృతకృత్యమైనది.
ఎల్ఐసి జాతీయీకరణ చట్టానికి సవరణలు చేసి భారతీయ జీవిత బీమా రంగ జాతీయీకరణ లక్ష్యాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఇన్సూరెన్స్ రంగ చట్ట సవరణ బిల్లు గతంలో అనేక సార్లు పార్లమెంట్లో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం 2021-22 సంవత్సర ఫైనాన్స్ బిల్లులో భాగంగా మార్చి ఆమోదింపచేసుకోవటం గమనార్హం. ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ జారీ చేసేందుకు సిద్ధమవటమే కాక దీనిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులను భాగస్వామ్యం చేసేందుకు కూడా అవసరమైన చర్యలకు పూనుకుంటోంది.
సెప్టెంబర్ 1, 1956న పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత 65 సంవత్సరాలుగా జాతీయీకరణ లక్ష్య సాధన ద్వారా దేశీయ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచింది. దేశ ఆర్థిక రంగాభివృద్ధికి 36 లక్ష కోట్ల రూపాయలను పెట్టుబడులుగా ఉంచింది. ఎల్ఐసి మొత్తం పెట్టుబడులలో 82 శాతం గవర్నమెంట్ సెక్యూరిటీలుగా, దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్దేశించినవే.
1956లో కేవలం 5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై అనంతరం 2011లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నియమాల ప్రకారం 100 కోట్లు పెట్టుబడిగా మార్పు చేసుకుంది. 'ప్రజల సొమ్ము ప్రజల శ్రేయస్సు'కే అనే లక్ష్యంతో ప్రారంభమైన ఎల్ఐసి దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా పాలసీదారులను కలిగిఉంది. 95 శాతం మిగులును పాలసీదారులకు బోనస్‌గా ప్రకటిస్తూ మిగిలిన 5 శాతాన్ని గవర్నమెంట్‌కు డివిడెండ్‌గా ఇస్తూ, పరస్పర సహకార స్ఫూర్తితో ప్రజలకు భరోసాను ఇచ్చింది.
ఎల్ఐసి ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులను దేశ ఆర్థికాభివృద్ధికి అందిస్తున్నది. ఎల్ఐసి యాజమాన్యం ఆధీనంలో (ఏయూఎమ్) ఉన్న మొత్తం ఆస్తుల విలువ 36.7 ట్రిలియన్లు. ఇది మొత్తం దేశ జాతీయ ఆదాయంలో 18 శాతానికి సమానం. మొత్తం భారత దేశంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ సంస్థల ఆస్తుల కన్నా 1.16 శాతం ఎక్కువ విలువైన ఆస్తులను ఎల్ఐసి కలిగి ఉన్నది. ఇప్పటి వరకు ఎల్ఐసి 28,695 కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్‌గా అందించింది.
భారత దేశ బీమా రంగంలో ప్రైవేటు, విదేశీ కంపెనీలను అనుమతించి 20 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ 23 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోటీపడి 66 శాతం ప్రీమిమం ఆదాయాన్ని 75 శాతం మేరకు పాలసీలను కైవసం చేసుకుని ప్రభుత్వ రంగ ఎల్ఐసి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. 2021 ఆర్థిక సంవత్సరం లోనే ఎల్ఐసి మొత్తం నికర ఆదాయం 6.82 లక్షల కోట్లు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2.1 లక్షల కోట్ల మేరకు క్లైయిములను చెల్లించింది. క్లైయిముల చెల్లింపులలో, ఎక్కువ మొత్తం పాలసీదారులు కలిగి ఉన్న ఎల్ఐసి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. 40 కోట్ల పట్టాదారుల ప్రయోజనాలను పణంగా పెట్టి...దేశ జనాభాలో కేవలం 3 శాతానికి పరిమితమైన స్టాక్ మార్కెట్ మదుపరులకు, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయగల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులకు ఎల్ఐసి ని కారుచౌకగా కట్టబెట్టే కార్యాచరణకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది.
ఎల్ఐసి అత్యంత పారదర్శకతతో, జవాబుదారీ తనంతో తన నిధులను, విధులను నిర్వహించి ప్రతి ఆర్థిక సంవత్సరం పార్లమెంట్ ఆమోదం పొందుతుంది. ఇటువంటి పారదర్శక సంస్థను నిధుల కోసం నిర్వీర్యం చేసే దిశగా ఎల్ఐసిని విలువ కట్టేందుకు మిల్లీమ్యాన్ అనే ఏక్చూరియల్ సంస్థను ప్రభుత్వం నియమించింది. 50కి పైగా పథకాలతో కూడిన వివిధ రకాల ఉత్పత్తులను కలిగిన ఎల్ఐసి భవిష్యత్ లాభాలకు సంబంధించిన ప్రస్తుత విలువలు కట్టడం కష్టతరం. రైల్వే తరువాత దేశంలో అత్యధిక ప్రదేశాలలో, స్వంత భవనాలతో కూడిన రియల్ ఎస్టేట్ బేస్ ఎల్ఐసి కలిగి ఉన్నది.
దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ఎల్ఐసి కి అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి. 14 దేశాలకు ఎల్ఐసి విస్తరించి ఉన్నది. అత్యంత నమ్మకమైన సంస్థగా అనేక సంస్థల టాప్ రేటింగ్స్‌లో ఉన్న ఎల్ఐసి బ్రాండ్ విలువను అంచనా వేయటమూ కష్టతరమే. ప్రభుత్వం పూనుకుంటున్న ఎల్ఐసి డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ వలన లక్షల కోట్ల విలువైన ఎల్ఐసి సంస్థ వాటాలను తక్కువగా మూల్యాంకనం చేసే పరిస్థితి పరిణమించింది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ వలన ఎల్ఐసి దేశాభివృద్ధికి నిధులు అందించటం, పట్టాదారులకు బోనస్ రూపంలో వారి పొదుపుపై ప్రయోజనాన్ని అందించటం కన్నా...షేర్ హోల్డర్లకి లాభాలు అందించేందుకు తన దృష్టిని మళ్ళించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎల్ఐసి వాటాల కొనుగోలుకు అనుమతించటం ద్వారా దేశీయ పొదుపుపై విదేశీ నియంత్రణ పెరిగి దేశాభివృద్ధికి, ఆర్థిక సార్వభౌమత్వానికి ఆటంకం ఏర్పడుతుంది.
భారత దేశంలోనే తయారు చేసి, భారత దేశంలోనే పెట్టుబడులు పెట్టి, భారత దేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే కంపెనీలను ప్రోత్సహించేందుకు నిర్దేశించిన 'మేకిన్ ఇండియా' నినాదం...ఇప్పటికే అంతకు మించిన స్థాయిలో ఉన్న ఎల్ఐసి విషయంలో ఆచరణకు నోచుకోకపోవడం విచారకరం. 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' ఉత్సవాలను నిర్వహిస్తూ, ఆదాయ అంతరాలను తగ్గించేందుకు, ప్రజలకు సామాజిక భద్రతను కల్పించేందుకు, రాజ్యాంగ పీఠిక ప్రబోధించిన సమానత్వం, సార్వభౌమత్వం అనే కీలక అంశాలను విస్మరించి దేశ ఆర్థిక వ్యవస్థకు అమృత తుల్యమైన ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలను అమ్ముకోవటం ప్రజామోదయోగ్యం కాదు.
/ వ్యాసకర్త : ప్రధాన కార్యదర్శి ఐసిఇయు, మచిలీపట్నం డివిజన్,
సెల్ : 9440905501 /
జి. కిషోర్ కుమార్