Jun 10,2021 15:45

హైదరాబాద్‌ : కరోనా రెండో దశలో మహమ్మారి విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అయితే, ఈ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు దేశంలో వ్యాక్యినేషన్‌ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, మెడికోవర్‌ ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం చేపట్టిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతంగా ముగిసింది. డాక్లర్లు, నర్సులు కలిసి కొన్ని గంటల వ్యవధిలోనే 40 వేల మందికి పైగా వ్యాక్సిన్లు వేశారు. ఈ తరహా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టడం దేశంలోనే తొలిసారి. ఈ మెగా ఈవెంట్‌లో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు, సెలబ్రిటీలు, ప్రముఖులు పాల్గొన్నారు. అంతేకాదు సైబరాబాద్‌ పోలీసులు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమాన్ని కొనియాడుతూ.. మిగిలిన వారు కూడా ముందుకు వచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవాలంటూ వారు వ్యాక్సిన్‌ తీసుకుంటుండగా తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేవారు. ఇదిలా ఉండగా, ఈ మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఓ నవ వధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి పీటలు ఎక్కడానికి గంట ముందు హైటెక్స్‌ గ్రౌండ్‌కు చేరుకుని వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పెళ్లి దుస్తుల్లో కనిపించారు. మెడికోవర్‌ నర్సులు ఆ నవ వధువుకు వ్యాక్సిన్‌ వేశారు. అనంతరం ఆమెతో ఫొటోలు దిగారు. వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత పెద్దగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదని, టీకా వేయించుకోవడం ఎగ్జయిటింగ్‌గా అనిపించిందని ఆ వధువు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఫొటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు. టీకా వేయించుకోవడానికి తన తల్లిదండ్రులు, వరుడి తరఫు కుటుంబ సభ్యులు అంగీకరించారని, వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటూ ప్రోత్సహించారని అన్నారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆమె కోరారు.