Jan 12,2021 21:29

న్యూఢిల్లీ : ప్రముఖ కమ్యూనిస్టు నేత, సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు గణేష్‌ శంకర్‌ విద్యార్ధి (96) కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం పాట్నాలోని ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం రాత్రి మరణించారు. బీహార్‌లో ఆయన్ను అందరూ గణేష్‌దా అని ఎంతో ఇష్టంగా పిలుచుకుంటారు. గణేష్‌ శంకర్‌ విద్యార్థి 17 ఏళ్ల వయస్సులోనే విద్యార్థిగా ఉన్న సమయంలో భారత స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గన్నారు. దాదాపు 8 దశాబ్దాల పాటు ఆయన ప్రజా జీవితంలో కొనసాగారు. అవిభాజ్య కమ్యూనిస్టు పార్టీలో 1942లో సాధారణ సభ్యునిగా చేరిన ఆయన తర్వాత సిపిఎం బీహార్‌ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అనేక సంవత్సరాల పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినా ఆయన భూమిలేని నిరుపేద రైతుల హక్కుల కోసం పోరాటాలు జరిపారు. ఈ పోరాటాల సమయంలో ఆయన ఆరేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. గణేష్‌ శంకర్‌ విద్యార్ధి మృతికి సిపిఎం పొలిట్‌బ్యూరోతో పాటు బీహార్‌ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది.