
అహ్మదాబాద్ : తనకు తాను దేవుడినని చెప్పుకుని దేశవ్యాప్తంగా ఆశ్రమాలు నెలకొల్పిన ఆశారామ్‌కు మరో అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. రూ.50 వేల జరిమానా కూడా కోర్టు విధించింది. 2013లో గాంధీనగర్ సమీపంలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో బస చేసిన బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందంటూ కేసు పెట్టారు. తొమ్మిదేళ్లకుపైగా జరిగిన విచారణ ముగియడంతో ఆశారామ్‌కు జీవిత ఖైదు విధిస్తూ గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న కేసులో జీవిత ఖైదీగా జోథ్‌పూర్ జైల్లో ఆశారామ్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. ఆశారామ్‌కు నేరాలు చేయడం అలవాటుగా మారిందని పేర్కొంటూ ఈ కేసులో భారీగా జరిమానాతోపాటు జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. వీడియో లింక్ ద్వారా ఇన్నేళ్లుగా ఆయన విచారణ జరిగింది.