Apr 08,2021 23:33

వాదులాడుకుంటున్న టిడిపి, వైసిపి ఏజెంట్లు

ప్రజాశక్తి-కొండపి: కొండపి మండలంలో కొన్ని గ్రామాలలో చిన్న చిన్న గొడవల పోలింగ్‌ జరిగింది. అందులో పెట్లూరులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాలుగైదు సార్లు చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. ఓటర్లు ఓటు చూపించే విషయంలో వివాదం జరిగింది. ఇద్దరు నాయకులు దగ్గర నుంచి డబ్బులు తీసుకొనడంతో వైసిపి చెందిన నాయకులు తమకు ఓటు ఇచ్చి వెళ్లాలని, టిడిపి అలా వద్దని వారించడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన గొడవ పెద్దదైంది. బయటకు వచ్చి పెద్దపెద్ద అరుపులు వేయడంతో ఓటర్లు ఒక్కసారిగా గుమికూడారు. వెంటనే పోలీసులు వారందరిని చెల్లాచెదురుగా పంపించివేశారు. మరికాసేపటికీ ఓటరు ఓటు వేసే విషయంలో లోపల ఉన్న ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. ఇది ఇలా ఉండగా పెట్లూరులోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద వాలంటీర్లు ఓటర్లును తీసుకువచ్చి ఓట్లు వేస్తున్నారని, వాలంటీర్లు పోలింగ్‌ కేంద్రం వద్ద ఉండకూ డదని టిడిపి వర్గీయులు చెప్పడంతో వైసిపి నాయకుల మధ్య గొడవ మొదలైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణి గింది. అలాగే గోగినేని వారిపాలెం, చోడవరం, వెన్నూరు తదితర గ్రామాలల్లోనూ చిన్నపాటి గొడవలు చెలరేగాయి.
కొన్ని గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ
మండలంలోని కొండపి పంచాయతీలోని గ్రామాలు, అనకర్లపూడి, నెన్నూరుపాడు, గుర్రపడియ, మూగచింతల, ఇలవర గ్రామాలలో టిడిపి నాయకులు పూర్తి స్థాయిలో ఎన్నికలను బహిష్కరించారు. ఆయా గ్రామాలలోని పోలింగ్‌ కేంద్రాల్లో టిడిపి ఏజెంట్లు కూడా కనిపించలేదు. వైసిపి ఏజెంట్లు మాత్రమే దర్శనమిచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఓటు వేసేందుకు సైతం వెళ్లలేదు. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి మద్ధతు తెలుపుతున్నామని ఆయా గ్రామాల టిడిపి నాయకులు తెలియజేశారు.