Feb 07,2023 00:07

గుంటూరు ధర్నా శిబిరంలో అంగన్వాడీలు

ప్రజాశక్తి - గుంటూరు, నరసరావుపేట : అంగన్‌వాడీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు దయా రమాదేవి, ముజఫర్‌ అహ్మద్‌ విమర్శించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గుంటూరు, పల్నాడు కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీలు సోమవారం భారీ ధర్నాలు నిర్వహించగా అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం స్పందనలో కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మున్సిపల్‌ గాంధీ పార్కు నుండి ప్రదర్శన చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రధాన గేటు ఎదుట పోలీసులు అడ్డుకోవడంతో ధర్నా చేశారు. కొద్ది సేపటికి కొంతమందిని అనుమతించడంతో వెళ్లి సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. గుంటూరులో ధర్నాకు యూనియన్‌ నాయకులు టి.రాధ అధ్యక్షత వహించారు.
రమాదేవి మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోర్కెలు కోరట్లేదని, ప్రభుత్వ వాగ్దానాలు, కార్మికులకు ఉన్న హక్కులే అడుగుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని, ఇది అంగన్‌వాడీలకు అమలు కావట్లేదని అన్నారు. సేవ పేరుతో ఐదేళ్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు రూ.లక్షల్లో జీతాలు, పెన్షన్‌ పొందుతున్నారని, కష్టపడి పనిచేసిన వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులంటూ సంక్షేమ పథకాలు కత్తిరిస్తున్న ప్రభుత్వం కనీస వేతనాలు అడుగుతుంటే మాత్రం మీరు ఉద్యోగులు కాదంటూ చెప్పటం ప్రభుత్వాల ద్వంద్వ నీతికి నిదర్శమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫుడ్‌ కమిషన్‌ పేరుతో అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్న చైర్మన్‌ పద్ధతి మార్చుకోకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు. అంగన్వాడీలపై అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. నెలల తరబడి వేతనాలు, బిల్లులు చెల్లించకపోతే అంగన్‌వాడీల కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర సరుకులన్నీ పెంచారని, వేతనాలు మాత్రం పెరగట్లేదన్నారు. అంగన్‌వాడీల హక్కుల కోసం ఏప్రిల్‌ 5న జరిగే ఛలోఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ యూనియన్‌ గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజీ, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మెటిల్లాదేవి, నాయకులు జి.మల్లేశ్వరి, డి.శివకుమారి మాట్లాడుతూ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూకు తగిన విధంగా ఛార్జీలు పెంచాలని, అంగన్వాడీలకు టిఎ బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరారు. అంగన్వాడీలకు సంబంధం లేని బిఎల్‌ఒ డ్యూటీలను బలవంతంగా కేటాయించొద్దని, పెండింగ్‌ వేతనాలు, బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ నుండి అంగన్‌వాడీలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ నిర్ణయించాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, సర్వీస్‌లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదాన్ని మోపే విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. గుంటూరు ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, నగర తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, అంగన్వాడి యూనియన్‌ జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, నాయకులు సుకన్య, సరళ, రత్నమంజుల, కృష్ణ కుమారి, ఎల్‌.అరుణ పాల్గొన్నారు. నరసరావుపేట ధర్నాలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు సిలార్‌ మసూద్‌, టి.శ్రీనివాసరావు, ఎం.హరిపోతురాజు, యూనియన్‌ జిల్లా కోశాధికారి ప్రసన్న, ప్రాజెక్టు కార్యదర్శులు కవిత, నిర్మల, షేక్‌ హజారా, శాంతకుమారి, ఎం.మణికుమారి, దేవకుమారి పాల్గొన్నారు.
అరవిందబాబు సంఘీభావం.. మోహరించిన పోలీసులు
అంగన్వాడీల ధర్నా సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్‌ వద్ద ఉదయం 10 గంటల నుండే భారీగా మోహరించారు. అంగన్వాడీలు ప్రదర్శనగా నినాదాలు చేస్తూ కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన గేటు వద్దకు రాగానే కలెక్టరేట్‌ గేటు మూసి తాళం వేసి అంగన్వాడీలను అడ్డుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ అంగన్వాడీలు ఎండలోనే అక్కడ నిరసన తెలిపారు. అనంతరం పది మందిని లోపలికి అనుమతించారు. ధర్నాకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు సంఘీభావం తెలిపారు. స్థానిక రైల్వే గేటు వద్ద ర్యాలీలో కలిసిన ఆయన కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసుల తీరును విమర్శించారు.