
న్యూఢిల్లీ : గోధుమల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం సడలించింది. ఎగుమతుల కోసం మే 13వ తేదీలోగా గోధుమలను సంబంధిత ప్రభుత్వ కేంద్రాలకు పరీక్షల కోసం అప్పగించిన, సిస్టమ్స్‌లో నమోదు చేసుకున్నా.. ఆ గోధుమలు ఎగుమతి చేయవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈజిప్ట్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇప్పటికే కాండ్లా ఓడరేవులో లోడ్ అవుతున్న గోధుమలను ఆ దేశానికి ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలకు గాను 44,340 మెట్రిక్ టన్నులను లోడ్ చేయగా, ఇంకా 17,160 మెట్రిక్ టన్నుల గోధుమలను లోడ్ చేయాల్సి వుంది. గోధుమల ఎగుమతులపై శనివారం కేంద్రం నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం పై ప్రతిపక్షాలు సహా పలు రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇతర దేశాల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి, ఆయా దేశాల అభ్యర్థనల మేరకు ఎగుమతులు చేయవచ్చని వాణిజ్య శాఖ పేర్కొంది. అలాగే రద్దు చేసేందుకు వీలులేని చెల్లింపులను జారీ చేసిన దేశాలకు ఎగుమతులు చేయవచ్చని ఆ నివేదికలో తెలిపింది. ఎగుమతులపై నిషేధంతో వివిధ రాష్ట్రాల్లో గోధుమల ధరలు ఒక్కసారిగా 4 నుండి 8 శాతం పడిపోయాయి. రాజస్తాన్‌లో క్వింటాల్ గోధుమల ధర రూ. 200-250 కాగా, పంజాబ్‌లో క్వింటాల్ ధర రూ. 100 -150కి పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో క్వింటాల్ గోధుమల ధర రూ. 100కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.