Aug 05,2022 13:15

వైఎస్సార్‌ కడప : వైసీపీ నేతల వికత చేష్టలపై మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదా ? అని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌. శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నందున.. తాము ఎటువంటి తప్పుచేసినా ప్రశ్నించకూడదు, ప్రసారం చేయకూడదు, ప్రచురించకూడదు అనే ధోరణిలో వైసీపీ నేతలు ఉంటున్నారని, వైసీపి నేతల వికృత చేష్టలకు రాష్ట్రంలోని మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ప్రజలు వీరిని అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసిపి నేతలు క్లబ్బులు పెట్టినా, కోడి పందేలు ఆడించినా, గ్యాంబ్లింగ్‌ చేసినా, పేకాట నిర్వహించినా, క్యాసినో నడిపినా ఎవరూ నోరు మెదపకూడదు అన్నట్లుంది వారి తీరు. దీనికితోడు.. ఎంపీ గోరంట్ల మాధవ్‌ అసభ్య రాసలీలల వీడియో తో అడ్డంగా దొరికిపోయినా వైసీపీ నేతలు అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. వైసీపీ నాయకులపై ఇప్పటిదాక వచ్చిన వైసీపీ నేతల ఆడియోలు, వీడియోలపై జగన్‌ ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.
'తెలుగుదేశం అధినేత ఎన్టీరామారావు కుమార్తె ఉమా మహేశ్వరి మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు ఉపయోగించుకోవడం వైసీపీ నేతలకే చెల్లింది. వైసీపీ నాయకులు రోజూ ఏదో ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ట్విట్టర్‌లు, ఫేస్‌ బుక్‌లు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కేసులు పెడతామని చెప్పే గోరంట్ల మాధవ్‌.. ఎంపీ నామినేషన్‌ వేసే సమయానికే అతనిపై కేసులు ఉన్నాయన్న సంగతి గుర్తించుకోవాలి. గోరంట్ల మాధవ్‌ వీడియోను మార్ఫింగ్‌ చేసి విడుదల చేయాల్సిన దౌర్భాగ్యం టీడీపీకి పట్టలేదు. అనంతపురం కు గోరంట్ల మాధవ్‌ వస్తున్నాడంటే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడో అని జనం భయపడే దుస్థితి జిల్లా లో ఏర్పడింది. టీడీపీ నాయకులు రోడ్లపైకి రావద్దు, ప్రభుత్వ అవినీతి పై మాట్లాడొద్దు, నిరసన కార్యక్రమాలు చేయొద్దంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు, పోలీసులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. వికత చేష్టలకు పాల్పడుతున్న ఎంపి గోరంట్ల మాధవ్‌పై పార్లమెంట్‌ లో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు' ఆయన అన్నారు.