Feb 27,2021 01:12

ఇనుప ముక్కలు చూపుతున్న రామానాయుడు

ప్రజాశక్తి-చోడవరం
గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని అస్థిరపరచి, దానిని దెబ్బతీయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని గుర్తింపు యూనియన్‌ అధ్యక్షుడు రామానాయుడు అన్నారు. శుక్రవారం ఫ్యాక్టరీ ఆవరణలో కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు అంతరాయం కలిగించే విధంగా కొంతమంది అజ్ఞాత వ్యక్తులు యంత్రాల్లో ఇనుప ముక్కలు వేస్తున్నారని, దీని వల్ల యంత్రాలు మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. ఫ్యాక్టరీలో ఉన్నవారే ఈ పని చేస్తున్నట్లు అనుమానం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా యంత్రాల్లో వేసిన ఇనుప ముక్కలను ఆయన చూపించారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి బకాయిలు లేకుండా కార్మికులకు జీతాలు చెల్లింపు జరిగిందన్నారు. ఫ్యాక్టరీ మనుగడను దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం సరికాదని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రాయి సూరిబాబు, జామి శీను, పిఎస్‌ నాయుడు, రాంబాబు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.