May 15,2022 06:04
  • పంచాయతీలకు చేరని ఆర్థికసంఘం నిధులు
  • వేల కోట్ల రూపాయలు మళ్ళింపు
  • వెనక్కిస్తామన్న సర్కారు హామీ మాటలకే పరిమితం
  • మరో ఆందోళనకు సర్పంచ్‌లు సమాయత్తం

ప్రజాశక్త-అమరావతి బ్యూరో : 'గ్రామాలు గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాలకోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది.' గ్రామ స్వరాజ్యం గురించి మహాత్మా గాంధీ చెప్పిన మాటలివి! రాష్ట్రంలో దానికి భిన్నంగా పరిస్థితులు తయారవుతున్నాయి. సాధారణ అవసరాల సంగతి అలా ఉంచితే, మంచినీటి సరఫరా వంటి అత్యంత కీలకమైన పనులు కూడా చేయలేక పంచాయతీలు కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలోని 80 శాతం పంచాయతీలు తీవ్ర తాగునీటి కొరతను ఎదుర్కుంటున్నాయి. పారిశుధ్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి అనేక పంచాయతీలు చేరాయి. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు చేరాల్సిన ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడమే ఈ దుస్థితికి కారణం. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినా ఆచరణ మాత్రం శూన్యం!

ఆర్థిక సంఘం నిధులను పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంది. గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతి కల్పన వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగించాల్సిన ఈ మొత్తం పంచాయతీలకు చేరకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఘోరంగా మారాయి. మౌలిక వసతుల కల్పన కోసం రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ నిధులను రాష్ట్ర తన ఖాతాకు మళ్లించుకోవడంతో పంచాయతీల ఖాతాలన్నీ జీరోగా మారిపోయాయి. దీనిపై గతంలోనే సర్పంచ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో ఆ మొత్తాన్ని పంచాయతీలకు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చి నాలుగు నెలలు దాటినా రాష్ట్ర సర్కారులో ఆ దిశలో ఎటువంటి కదలిక కనిపించడం లేదు. నిధుల గురించి ఆరా తీస్తున్న సర్పంచ్‌లకు ఉన్నతాధికారులు జవాబియ్యడం మానేశారు. దీంతో సర్పంచ్‌లు మరోమారు ఆందోళనకు సిద్దమవుతున్నారు.

  • ఎంత మొత్తం...?

ఇలా ఇతర అవసరాలకు మళ్ళించిన మొత్తం గురించి కూడా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,118.12 కోట్లను 2019 జూన్‌లో, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,516.15 కోట్లను ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. అంటే, 4,634.27 కోట్ల రూపాయలు. ఎపి పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ లెక్కల ప్రకారం ఇలా దారి మళ్లిన మొత్తం రూ.7,660 కోట్లు. 14, 15 ఆర్థిక సంఘాలతో సంబంధం లేని ఇతర మొత్తాలను కూడా కలిపి ఛాంబర్‌ లెక్క చెబుతోందని అధికారవర్గాలు అంటున్నాయి.
ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచినా ప్రభుత్వం నుండి రావాల్సిన ఈ మొత్తం కోసం గతంలో పంచాయతీ సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. దీంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు ఆర్థిక సంఘం నిధులకోసం ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతాలను తెరవాలని, ఆ వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మేరకు పంచాయతీల సర్పంచ్‌లు అందరూ ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. అయినా, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు.
ఇవీ సమస్యలు
నిధులు లేకపోవడంతో వేసవిలో గ్రామాలలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు, నీటి సౌకర్యంలేని ప్రాంతాలకు ట్యాంకర్లను పంపించేందుకు నిధులు లేని పరిస్థితి అనేక పంచాయతీల్లో నెలకొంది. గ్రామాలలో అంతర్గత రోడ్లు, విద్యుత్‌ లైన్లు, డ్రైనేజీ నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. గ్రామాలలో చేసిన పనులకు పాత బిల్లులు చెల్లించకపోవడంతో, కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లకు ముందుకు రావడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లో ఏ పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

  • న్యాయపోరాటం చేస్తున్నాం... రాజేంద్రప్రసాద్‌

రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు రావాల్సిన నిధుల కోసం న్యాయపోరాటం చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. ఈ మేరకు హైకోర్టులో రెండు కేసులు వేసినట్లు తెలిపారు. గ్రామాలలో నీటి ఎద్దడి నివారణ, స్థానికంగా చేపట్టిన పనులకు రూ.వెయ్యి కోట్ల బిల్లులను పంచాయతీలు చెల్లించాల్సి ఉందని చెప్పారు.