May 27,2023 01:03
ప్రజాభిప్రాయ సేకరిస్తున్న ఆర్డీవో సరోజిని

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: మండలంలోని కొనిదెన గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్‌ 103/పిలోని 0.598 హెక్టార్లలో శ్రీ శ్రీనివాస గ్రానైట్‌ క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీవో సరోజిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా క్వారీ ఏర్పాటు విషయంలో గ్రామస్తులు తమ అభిప్రాయం వెల్లడించాలని కోరారు. క్వారీ సమీపంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 40 మంది తమకు గ్రానైట్‌ క్వారీ ఏర్పాటుపై ఏ విధమైన అభ్యంతరం లేదని అన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించి గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటడంతో పాటు వాహనాలు వెళ్లే సమయంలో వాయు కాలుష్యం వెలువడకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పర్యావరణ శాఖ ఈఈ నాగిరెడ్డి మాట్లాడుతూ తమ పరిధిలో ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేసే విషయంలో దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల నుండి ప్రజాభిప్రాయం సేకరిస్తామని, వారి నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. శ్రీ శ్రీనివాస గ్రానైట్‌ క్వారీ ఏర్పాటుపై పరిసర గ్రామ ప్రజలంతా సానుకూలంగా స్పందించటం అభినందనీయమన్నారు.