May 31,2023 21:55

ఫొటో : మాట్లాడుతున్న ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక బృందం

గ్రావెల్‌ గుంతలు పరిశీలన
ప్రజాశక్తి-కావలి : రుద్రకోట గ్రామంలో అధికార పార్టీ నేతలు అక్రమంగా తవ్వుతున్న గ్రావెల్‌ గుంతలను బుధవారం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక, కావలి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు ''కావలి ఎంఎల్‌ఎ మట్టి దోపిడీ''పై మండిపడ్డారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి చింతాల వెంకటరావు మాట్లాడుతూ అధికార పార్టీ దోపిడీలో భాగంగానే గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. జెసిబిలు డంపర్లు గుంతల్లోకి పోతే కనపడని విధంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రిషికొండ దగ్గర నుంచి మారుమూల ప్రాంతం వరకు అధికారం అడ్డుపెట్టుకొని అన్నింటినీ కొల్లగొడుతున్నారన్నారు.
వీరి దోపిడీ ప్రకృతికే క్రాఫ్‌ చేస్తున్న విధంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రశ్నించకపోతే రేపు మన ఇండ్లను కూడా వారు కబ్జా చేస్తారన్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా వైసిపి పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వేదిక కన్వీనర్‌ సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో మట్టి దోపిడీలో కావలి ఎమ్మెల్యే ''నెవర్‌ బిఫోర్‌ - ఎవర్‌ ఆఫ్టర్‌'' అని ఎద్దేవా చేశారు. రుద్రకోటలో గ్రావెల్‌ తవ్వకాలు సింగరేణి బొగ్గు గనులను తలపించే విధంగా, కెజిఎఫ్‌ గనులను మైమరిపించే విధంగా ఉన్నాయన్నారు. సుమారు 30 అడుగుల లోతుకుపైగా గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుతున్నారని తెలిపారు. కావలి ఎంఎల్‌ఎ కావలి సహజవనరులను కొల్లగొడుతున్నారన్నారు. అధికారులు కళ్లకు గంతులు కట్టుకున్నారా.. అని ప్రశ్నించారు. తక్షణమే గ్రావెల్‌ దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నాయకులు తాళ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ చెరువు కన్నా లోతుగా గ్రావెల్‌ను అక్రమంగా తవ్వారన్నారు. ఎవరి అనుమతులతో గ్రావెల్‌ తవ్వుతున్నారని ప్రశ్నించారు. రోజుకు 150 ట్రిప్పులకు పైగా గ్రావెల్‌ అక్రమంగా తరలి వెళ్తునందన్నారు. జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు మట్టి, ఇసుక దొరకని విధంగా దోపిడీ చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో చెరువులు, కుంటలు, మిగలవన్నారు. ప్రభుత్వ వనరులను స్వంత లాభాల కోసం దోపిడీ చేస్తున్నారని తెలిపారు. అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నాలుగేళ్లలో కావలి ఎంఎల్‌ఎ ఏమి అభివృద్ధి చేసారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిపిఐఎంఎల్‌ నాయకులు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ తాటిచెట్టంత లోతున గ్రావెల్‌ అక్రమంగా కొల్లగొడుతున్నారన్నారు. అక్రమ గ్రావెల్‌ను అడ్డుకున్నందుకు గ్రామస్తులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు సిద్ధమవ్వాలన్నారు. అఖిలపక్ష నాయకులు సిపిఎం నాయకులు పి.పెంచలయ్య మాట్లాడుతూ అక్రమ గ్రావెల్‌ తవ్వకాల పట్ల అధికారులు నిమ్మకు నీరేతినట్లు ఉన్నారన్నారు. అనుమతులు లేకుండా కోట్ల రూపాయల గ్రావెల్‌ ను తవ్వుతున్నారని తెలిపారు. అనంతరం అక్రమగా కేసులు బనాయించిన గ్రామస్తులను విచారించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహరావు, జనసేన నాయకులు గడే నాగార్జున తదితరులు ఉన్నారు.