Oct 17,2020 11:20

పాట్నా : 'బీహార్‌లోనే ఉండండి..ప్రతి ఒక్కరికి ఉద్యోగాలిస్తాం. ఇతర రాష్ట్రాలకు వలసపోయి తిరిగి వచ్చిన వారి శ్రమను, నైపుణ్యాలను బీహార్‌ అభివృద్ధికి వినియోగించుకుంటాం' అని మే 23న ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ హామీనిచ్చారు. కరోనా లాక్‌డౌన్‌తో వలస కార్మికుల రాష్ట్రానికి చేరుకున్న అనంతరం ..ఓ వీడియో సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఆ పరిస్థితి ఉందా..అంటే లేదనేది పచ్చి వాస్తవం.

గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గర్‌ అభియాన్‌ అంతంత మాత్రమే...ఉపాధి లేక వలస బాటలో బీహారీలు..

   వలస కార్మికులు సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించేందుకు ' గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గర్‌ అభియాన్‌ పథకా'న్ని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బీహార్‌లోని ఖగారియా జిల్లాలోని తేలిహార్‌ గ్రామం నుండి ప్రారంభించారు. కానీ ఆ రాష్ట్రంలో పనిదొరక్క ఎంతో మంది వలసకార్మికులు...తిరిగి వలస బాటపట్టారు. 28 ఏళ్ల మహ్మద్‌ జాహిదో.. ప్రభుత్వ ప్రకటనతో ఎంతో ఉత్సాహంగా సొంత రాష్ట్రానికి చేరుకున్న ఢిల్లీ వలస కార్మికుడు..పట్టుమని పదిహేను రోజులు కూడా గడవకుండానే తిరిగి దేశ రాజధానికి పయనమయ్యారు. తాను రూ.2500 బస్సు చార్జీలు చెల్లించి ఢిల్లీకి చేరుకున్నానని..కానీ గతంలో తాను పనిచేసిన కర్మాగారం మూతపడటంతో..చేసేదేమీ లేక హర్యానాలో వరి కోత పనులకు వెళుతున్నట్లు చెప్పారు. హిరాలాల్‌ది మరో కన్నీటి వ్యథ..సీతా మర్హి జిల్లాకు చెందిన హీరాలాల్‌ మంజి..లాక్‌డౌన్‌తో ఇంటి ముఖం పట్టాడు. రాష్ట్రంలో పనులు దొరక్క..తిరిగి హర్యానాకు చేరుకున్నారు. తాను రెండు నెలలు బీహార్‌లో ఉన్నానని, కాని ఎటువంటి ఉపాధి లభించలేదని తెలిపారు. ఇక్కడ బియ్యపు మూటలు మోస్తున్నట్లు చెప్పారు. ఒక్క జాహీద్‌, హీరాలాల్‌లవే ఇవే పరిస్థితులు అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్క శ్రామికునిదీ ఇదే పరిస్థితి.

గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గర్‌ అభియాన్‌ అంతంత మాత్రమే...ఉపాధి లేక వలస బాటలో బీహారీలు..
రూ. 7వేల కోట్లు వృథాగా పోవాల్సిందేనా..?
కరోనా లాక్‌డౌన్‌తో వలస వచ్చిన కార్మికులకు..సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించేందుకు రోజ్‌గర్‌ అభియాన్‌ పథకాన్ని ప్రారంభించామని ప్రధాని చెప్పారు. స్వస్థలాలోన్నే సోదరీమణుల, యువత 125 రోజుల పాటు ఉపాధి పొందవచ్చునని మోడీ పేర్కొన్నారు. దీని కింద రూ. 50 వేల కోట్లను 23. 6 లక్షల మంది వలస కూలీలకు చేయూతనిచ్చేందుకు పలు రాష్ట్రాలకు కేటాయించింది. ఇందులో భాగంగా బీహార్‌కు రూ. 17 వేల కోట్లను అందించింది. అందులో రూ. 10వేల కోట్లు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయగల్గింది. ఈ ప్రచారంలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలదీ ఇదే దారి. అత్యధిక సంఖ్యలో వలస కూలీలు తిరిగి వచ్చిన రాష్ట్రం బీహార్‌. కావడం..అందులోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పథకం కింద గరిష్ట జిల్లాలను ఎంపిక చేశారు. ఈ పథకం కింద ఆరు రాష్ట్రాలకు చెందిన 116 జిల్లాలను ఎంపిక చేయగా..బీహార్‌లో 32, యుపిలో 31, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్తాన్‌లో 22, ఒడిశాలో నాలుగు, జార్ఖండ్‌లో మూడు జిల్లాలున్నాయి. 'ది వైర్‌' సమాచారం ప్రకారం బీహార్‌కు రూ. 17,956.8 కోట్లను కేటాయించగా రూ.10, 006.1 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఈ పథకం అక్టోబర్‌ 22తో ముగియనున్న నేపథ్యంలో మిగిలిన రూ. 7 వేల కోట్లు ఖర్చు చేయడం కష్టమే! రాష్ట్రంలో వలస కార్మికులకు ఉపాధి కల్పించక...కేంద్రం నిధులను సద్వినియోగపర్చుకోవడంలో బీహార్‌ ప్రభుత్వం విఫలమైందని అర్థమౌతోంది. దీంతో ఉపాధి లేక..బీహారీలు తిరిగి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు.