Jul 03,2022 22:53

ప్రజాశక్తి - భీమడోలు
            గ్రంథాలయాల సేవలను వినియోగించుకోవాలని పూళ్ల గ్రామపంచాయతీ సర్పంచి దాయం సుజాత ప్రసాద్‌ కోరారు. పూళ్ల శాఖా గ్రంథాలయ పాలకులు కె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచి విచ్చేశారు. శిబిరం నిర్వహణకు సహకరించిన సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌, జి.ఈశ్వరితోపాటు మానవత సంస్థ భీమడోలు శాఖ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావును సన్మానించారు. వివిధ అంశాల్లో విజయం సాధించిన 80 మంది విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సర్పంచి సహకారంతో నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు గ్రంథ పాలకులు అమర్‌నాథ్‌, భీమడోలు మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ పివి.కృష్ణారావు, ఎంపిటిసిలు జి.వెంకటేశ్వరరావు, జి.కృష్ణతో పాటు అన్నేవారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్‌ మస్తాన్‌ పాల్గొన్నారు.