
మగవాళ్ల కన్నా ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు అని చాలా విషయాల్లో రుజువు చేసుకున్నారు. ఇప్పటివరకూ తమకు అవకాశం లేని రంగాల్లో ప్రవేశించి తమ సత్తా చాటుకున్నారు. కొత్తగా ఇప్పుడు ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కూడా 50 మంది అమ్మాయిలు సిద్ధమవుతున్నారు.
కర్ణాటకలో పలు తీరప్రాంతాల్లో టెర్రరిస్టుల భయందోళనకు గురౌతున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. వీరి నుంచి ప్రజలకు రక్షణ కోసం 2010లో 'గరుడ కమాండో' (ఉగ్రవాద నిరోధక శక్తి) బృందం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకూ ఇందులో మహిళలకు ప్రవేశం కల్పించలేదు. అనుక్షణం అలర్టెగా ఉంటూ- ఎక్కడికంటే అక్కడకు వెళుతూ టెర్రరిస్టులను ఎదుర్కొవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఈ బృందానికి ట్రైనింగ్ మామూలుగా ఉండదు. అందుకని ఇప్పటివరకూ మహిళలను తీసుకోలేదు. 'ది రెస్పాన్స్ కౌంటర్ టెర్రరిజం టీం' సెంటర్ బెంగుళూరులో ఉంది. అక్కడి అధికారుల అభ్యర్థన మేరకు కొంతమంది మహిళలను ఈ గరుడ కమాండోలోకి ప్రవేశం కల్పించారు.
ఈ సంవత్సరం 50 మంది అమ్మాయిలకు శిక్షణ ఇస్తున్నారు. వీరంతా ప్రతిరోజూ 12 గంటల ట్రైనింగ్ తీసుకుంటున్నారు. గ్రెనేడ్లను నిర్వహించడం, పెద్ద పెద్ద రాళ్లను ఎత్తడం, తాడు మీదగా నడవడం నేర్చుకుంటున్నారు. ఆయుధాలతో ఉగ్రవాదులను ఏ విధంగా ఎదుర్కొవాలో తెలుసుకుంటున్నారు. పేలుడు పదార్థాలతో పరికరాల వాడకంపై అవగాహన, రోప్ వర్క్, కమ్యూనికేషన్స్, సిఎడి (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) నావిగేషన్, మెడికల్ ప్రథమ చికిత్స, పిన్ (ప్రణాళిక, ఇంటెలిజెన్స్ అండ్ ఇంటరాక్షన్) మొదలైన వాటి గురించి శిక్షణ పొందుతున్నారు. వీరు కర్ణాటక తీరప్రాంతాలు, ఐటి-బిటి కంపెనీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో డ్యూటీ చేయనున్నారు.
వీరిలో కొంతమందికి పోలీసు శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. కానీ, ఈ శిక్షణ మాత్రం కొత్తదే. వారు ఈ బృందంలో ప్రవేశానికి చాలా కాలంగా ప్రయత్నించారు. ఈ ట్రైనింగ్ ముగిశాక రాత పరీక్ష ఉంటుంది. వీరికి మహిళా పోలీసు సూపరింటెండెంట్ మధుర వీణ శిక్షణ ఇస్తున్నారు. పురుషుడికి, మహిళకి ఒకే శక్తి ఉంటుంది. అది మనం మానసిక స్థైర్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఉమాశ్రీ (26) అంటుంది. శిక్షణ పొందుతున్న వారిలో చాలామంది సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారే. రిజ్వానా తండ్రి ఓ పేద రైతు. ఆమెకు చిన్నప్పటి నుంచి పోలీసు అధికారి కావాలని కలలు కనేది. ఇప్పుడు గరుడ కమాండోలోకి ఎంపికైంది. శిక్షణ కఠినంగా ఉన్నా పట్టు వదలకుండా బలం అంతా కూడగట్టుకొని తమ సామార్థ్యాన్ని నిరుపించుకుంటున్నారు ఆ యువతులు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భాస్కరరావు వారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.