Mar 28,2023 01:19
కలెక్టరుకు వినతిపత్రం అందిస్తున్న టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న గ్రూప్‌ 1 మెయిన్స్‌ గడువు అదనంగా 3 నెలలపాటు పెంచాలని కోరుతూ తెలుగు విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు (టిఎన్‌ఎస్‌ఎఫ్‌) మొవ్వ శరత్‌ చంద్ర సోమవారం స్పందనలో బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం శరత్‌ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం అయ్యాక ఆ మాటే మరిచారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాక, మరోవైపు ప్రయివేట్‌ ఉద్యోగాలు లేక యువత నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల అనంతరం విడుదల చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులకు సన్నద్ధం అయ్యే సమయం తక్కువగా ఉండడం వారిని ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ప్రిపరేషన్‌ కోసం 90 రోజుల కంటే తక్కువ సమయం ఇవ్వడం, మెయిన్స్‌ పరీక్షకు సిద్ధం కావడానికి ఏడు పేపర్లు పూర్తి చేయాల్సి ఉన్నందున టెన్షన్‌ పడుతున్నారని తెలిపారు. మెయిన్స్‌ ప్రిపరేషన్‌కి ఇచ్చిన గడువుకు అదనంగా మరో 90 రోజుల సమయం కేటాయించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాపట్ల జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి యెనుముల రాంబాబు, బాపట్ల జిల్లా సెక్రటరీ పరిశా గోపి, వేమూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు బోరుగడ్డ ఆనంద్‌, కార్యదర్శి రత్నపాల్‌, ఉడత దేవేందర్‌ బాలాజీ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.