
ప్రజాశక్తి-భట్టిప్రోలు: జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలలో పురోగతిని సాధించాలని రేపల్లె ఆర్‌డిఓ పార్థసారథి సూచించారు. భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో మూడు లే ఔట్‌లలో రెండోది కోర్టు పెండింగ్‌లో ఉండగా మిగిలిన వాటిలో దాదాపు 1080 పైగా లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 276 మంది మాత్రమే గృహాల పనులు ప్రారంభించారని, మిగిలిన వారు ఎందుకు ప్రారంభించలేదని ఆర్‌డిఓ ప్రశ్నించారు. అందుకు కలిగే ఇబ్బందులు, అందాల్సిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. రహదార్లు, నిర్మాణానికి అవసరమైన నీరు, బిల్లులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి లబ్ధిదారుడు గృహ నిర్మాణం ప్రారంభించుకొనే విధంగా మండల స్థాయి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మిగిలిన గ్రామాలలో కూడా నిర్మాణాల పరిస్థితిని ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో తీసుకున్న టార్గెట్ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎంఎల్ శ్రావణ్ కుమార్, హౌసింగ్ ఏఇ సౌమ్య, పిఆర్ ఏఇ రామచంద్రరావు, విఆర్‌ఓలు శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.