
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పక్కా గృహాల నిర్మాణాలలో పురోగతి సాధనకు అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే లక్ష్య సాధన సాధ్యమేనని, విధి నిర్వహణ సులువుగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 10,892 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం 8,394 గృహాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 2,498 గృహాలు జూలై నెల చివరి నాటికి పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. పక్కా గృహాల నిర్మాణాలలో పురోగతి సాధించడానికి మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజూ క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకొని నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఒక్కరికీ సగటున అయిదు గృహాల చొప్పున పర్యవేక్షించేలా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పునాది దిగువన ఉన్న గృహాలను పునాది స్థాయికి తీసుకువచ్చేలా లబ్ధిదారులను చైతన్య పరచాలన్నారు. వేమూరు, అమర్తలూరు మండలాలలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో గృహ నిర్మాణ శాఖ ఏఇలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అలాగే వేమూరు, చీరాల, వేటపాలెం మండలాలలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీస్ జారీ చేయాల న్నారు. గృహ నిర్మాణాలలో పురోగతి సాధించడానికి స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ సదు పాయం కల్పించాలన్నారు. లబ్ధిదారులను చైతన్యపరచ డంతోపాటు గృహ నిర్మాణ సామగ్రి సమకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న భవనాలకు సంబంధించిన బిల్లులను తక్షణమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కింద చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. నాడు-నేడు పాఠశాలల అభివృద్ధి పనులు నిర్దేశించిన పది అంశాలలో జూన్ 12వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు.
రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఆదేశించారు. చీరాలలో రీ సర్వే చేసిన భూములలో హద్దురాళ్లు త్వరగా వేయాలని ఆయన సూచించారు. రెవెన్యూ అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మి శివ జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.