May 05,2021 09:58

మన దేశానికి స్వతంత్రం వచ్చాక తిరుపతిలో అనేక పర్యాయాలు అనేక ఎన్నికలు జరిగాయి. కాని ఎన్నడూ అక్కడ మత ప్రసక్తి రాలేదు. ఇటీవల లోక్‌సభ ఉప ఎన్నిక జరిగినప్పుడు మత ప్రస్తావన రావడం, అక్కడ పుట్టినవాడిగా నాకు బాధ కలిగించింది. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం అనాగరికతే కాదు. వారి స్వీయబల రాహిత్యానికీ సంకేతం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయం. అక్కడికి ప్రతి రోజూ అనేక ప్రదేశాల నుండి భక్తులు వస్తుంటారు. స్థానికంగా నివసించే ప్రజల్లో అధిక సంఖ్యలో ఆయన భక్తులు ఉన్నారు. అయినంత మాత్రాన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో అక్కడ మత ప్రస్తావన తీసుకురావడం అసంబద్ధం, అశాస్త్రీయం. మేము భక్తులమైనంత మాత్రాన, మమ్మల్ని, మతం గాట్లో కట్టివేయవద్దని...ఇంకా స్పష్టంగా మతం, భక్తి సొంత విషయాలు, వాటిని మా భౌతిక జీవితంలోకి తీసుకు రావద్దు. మా భక్తిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించు కోవద్దని తిరుపతి ప్రజలు ముక్త కంఠంతో చాటి చెప్పారు.
   గుడులు ఉన్న స్థలాలన్నీ, ఊర్లన్నీ మత కేంద్రాలయ్యేటట్టుంటే, తిరుపతి మాత్రమే కాదు. ప్రతి గ్రామమూ మత కేంద్రమే అవుతుంది. ఏ ఊరికి వెళ్ళినా ఒక రామాలయమో, కృష్ణాలయమో, శివాలయమో ఉంటాయి. ఒక మసీదు ఉంటుంది. ఒక చర్చి ఉంటుంది. అంతమాత్రం చేత అవన్నీ మత కేంద్రాలయిపోతాయా? ప్రజాస్వామ్య, లౌకికవాదాలనే మాటలను రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ అవి అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి. ప్రజాస్వామ్యం అంటే దైవస్వామ్యం కాదని అర్ధం, అంటే మతంతో సంబంధం లేనిదని అర్ధం. లౌకిక వాదం అంటే భౌతిక వాదమని అర్ధం. అలౌకికవాదం కానిది అని అర్ధం. అయినాసరే ఆ మహోన్నతమైన, మానవీయమైన ఆ సూత్రాలను గాలికి వదిలేసి మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం చాలా హీనమైన చర్య. ఈ వాస్తవాన్ని, వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యధికులున్న తిరుపతి నియోజకవర్గ ప్రజలే ముక్త కంఠంతో చాటిచెప్పారు. ఇకనైనా, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే దురలవాటును వదులుకోవడం మంచిది.
  మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా భారతీయులు అనేక భౌతిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంకా మూడు పూటలా తిండి తినలేని వాళ్ళున్నారు. ఇంకా చెట్ల కింద, ఫుట్‌పాత్‌ల మీద జీవితం గడిపే వాళ్ళున్నారు. ఇంకా కూటి కోసం శరీరాలను అర్పించే వాళ్ళున్నారు. సరైన విద్యను సంపాదించుకోలేని వాళ్ళు ఉన్నారు. ఉన్నచోట ఉపాధి లేక ప్రజలు వలసలు పోతున్నారు. వాళ్ళ శ్రమ దోపిడీకి గురౌతున్నది. ప్రజలు గ్రామాలలో ఉండలేక పట్టణాలకు, నగరాలకు వెళ్ళిపోతున్నారు. చాలా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్నాయి. ప్రాంతీయ వివక్షలు కొనసాగుతున్నాయి. కరువులు ఒకవైపు తుఫానులు, వరదలు ఇంకోవైపు విభిన్న ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు వ్యవసాయం జరగక బాధలు పడుతున్నారు. ప్రపంచీకరణ అనేక వృత్తులను ధ్వంసం చేసింది. వృత్తులు కోల్పోయిన వృత్తికారులను పట్టించుకోవడం లేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళల మీద, బలహీన వర్గాల ప్రజల మీద నిరంతర దాడులు జరుగుతున్నాయి.
  మన సాంస్కృతిక రంగం విష సంస్కృతి విలసనంతో కునారిల్లుతున్నది. సినిమాలు, సీరియళ్ళు దైనందిన ప్రజా జీవితానికి ఎంత దూరం జరగాలో అంత దూరం జరిగిపోయాయి. దూరం జరిగిపోయి ప్రజల మీద దుష్ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్ని సమస్యలు మన దేశాన్ని చుట్టుముట్టి పీడిస్తూ ఉంటే, వీటినన్నిటినీ వదిలేసి, మతాన్ని పట్టుకొచ్చి జనం నెత్తిన దించడం అన్యాయం.
   రాయలసీమలో ఓట్లు అడగడానికి వచ్చే వాళ్ళు దేవుళ్ళు, మతాలను మోసుకొని రాకండి ఇకమీదటనైనా. రాయలసీమకు నీళ్ళు కావాలి. నిధులు కావాలి. పరిశ్రమలు కావాలి. రాయలసీమ ఆత్మగౌరవాన్ని మంటగలిపే సినిమాల నుండి విముక్తి కావాలి. 2014లో వెంకటేశ్వర స్వామి దగ్గర ఇచ్చిన వాగ్దానాల అమలు కావాలి. ఓట్లు అడగటానికి వచ్చే వాళ్ళు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పాలి. అంతేగాని మతం జపం చేస్తూ రాకండి. ప్రజల్ని అవమానించకండి. గుడి ఉన్నంత మాత్రాన, ప్రజలకు మతం మీద విశ్వాసం ఉన్నంత మాత్రాన వాళ్ళు మతోన్మాదులు కారు.
 

/ వ్యాసకర్త ప్రజాశక్తి బుకహేౌస్‌ గౌరవ సంపాదకులు /

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి