
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలన్నీ అత్యవసరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా, తీసుకోవాల్సిన విధానాలపైనా దృష్టి పెట్టాయి. ఈ కోవలోనే ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పలు ఆదేశాలు జారీ చేసింది. వారం వారం తప్పని సరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని, టెస్టు రిపోర్టులను ఆఫీసులో సబ్మిట్ చేయాలని ఆదేశించింది. పనిలో పనిగా ఉద్యోగులు ఆఫీస్కు రావాలనుకుంటే... కచ్చితంగా సర్జికల్ గ్రేడ్ మాస్క్లు ధరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వర్క్ ఫ్రమ్ హౌమ్లో పనిచేసే ఉద్యోగులకు కోవిడ్ టెస్ట్ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవని ఆ సంస్థ తెలిపింది. ఇలా కోవిడ్ నిబంధనలు పాటించడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని, కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు తప్పని సరిగా మాస్క్లు ధరించాలని సూచించామని' గూగుల్ స్పోక్ పర్సన్ తెలిపారు.