Jul 29,2021 22:45

మాస్కో : వ్యక్తిగత డేటా చట్టాలను ఉల్లంఘించినందుకు గానూ గూగుల్‌కు 30లక్షల రూబుళ్ల (41,017 డాలర్లు) జరిమానాను రష్యా గరువారం విధించింది. ఈ నేరానికి గానూ గూగుల్‌కు మొదటిసారిగా ఈ జరిమానా పడిందని తాగన్‌స్కీ జిల్లా కోర్టు తెలిపింది. ఈ విషయాన్ని గూగుల్‌ కూడా నిర్ధారించింది కానీ దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. గూగుల్‌తో రష్యాకి వున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ పెనాల్టీ చోటు చేసుకుంది. నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో విఫలమైనందుకు సామాజిక మాధ్యమ దిగ్గజాలపై రష్యా జరిమానాలు విధిస్తూ వస్తోంది. పైగా రష్యాలో కార్యాలయాలు తెరవాలంటూ విదేశీ టెక్‌ సంస్థలపై ఒత్తిడి తెస్తోంది. గత నెల్లో ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ నియంత్రణా సంస్థ రోస్కోమజ్దూర్‌ మాట్లాడుతూ, అల్ఫాబెట్‌ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ అయిన గూగుల్‌ రష్యాలోని వినియోగదారుల వ్యక్తిగత డేటాను దేశంలోని డేటా బేస్‌ల్లో నిల్వ చేయనందుకు గానూ 60లక్షల రూబుళ్ళవరకు జరిమానా విధించాల్సి వుందని అన్నారు. గతంలో కూడా నిషేధిత సమాచారాన్ని తొలగించలేదంటూ గూగుల్‌పై జరిమానా విధించిన సంఘటన చోటు చేసుకుంది. క్రెమ్లిన్‌ అనుకూల ప్రముఖులు, మీడియాకు చెందిన యూ ట్యూబ్‌ ఖాతాలలను బ్లాక్‌చేయడం ద్వారా రష్యన్‌ అధికారులను గూగుల్‌ అసహనానికి గురి చేసింది.