గుమ్మగట్ట బిసి బాలికల పాఠశాలలో 14 మంది విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్ లక్షణాలు
రాయదుర్గం: గుమ్మగట్టలోని మహాత్మ జ్యోతిరావు పూలే బిసి బాలికల పాఠశాలలో 13 మంది విద్యార్థినులతోపాటు ఒక టీచర్‌కు కోవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. ఈమేరకు మంగళవారం పాఠశాలలో విద్యార్థినులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏడుగురికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. వారికి మందుల కిట్లు ఇచ్చి హోం ఐసొలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న ఆరుగురు విద్యార్థినులకు మందులు ఇచ్చి వారి స్వస్థలాలకు పంపినట్టు తెలిపారు. అలాగే కోవిద్ లక్షణాలు ఉన్న టీచర్‌ను కూడా హోం ఐసొలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న ఇతర విద్యార్థినులకు కూడా వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో పాఠశాలను శానిటైజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మురళీధర్, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఆరోగ్య కార్యకర్త రత్నమ్మ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
గుత్తిలో ఏడుగురికి పాజిటివ్..
గుత్తి : పట్టణంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఏడుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులకు వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిందన్నారు. దీంతో మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.