
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం వాడీవేడిగా జరిగింది. పలు అంశాలను ప్రస్తావించిన కార్పొరేటర్లు అధికారులపై ధ్వజమెత్తారు. నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాల్లో గుంటూరు నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశ మందిరం రిపేర్లలో ఉండటం వల్ల తొలిసారిగా కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. పారిశుధ్యం, వీధిలైట్లు, హోర్డింగ్‌లలో అవినీతి అక్రమాలు, బస్‌బేలలో అసాంఘిక కార్యకలపాలు, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులతో పలువురు కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. నగరంలో రోడ్ల విస్తరణలో నష్టపోతున్న వారికి నష్టపరిహారం చెల్లించడానికి కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నగరంలో ఎంతో కీలక సమస్యగా ఉన్న తాగునీటి సరఫరా లోపాలపై కనీసం చర్చ చేపట్టలేదు. టిడిపి కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొన్ని రోజులుగా పశ్చిమ నియోజకవర్గంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, కమిషనర్‌ను కొంతమంది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు ఈ అంశంపై చర్చించాలని కార్పొరేటర్ శ్రీరాం ప్రసాద్ ప్రయత్నించినా మేయర్ అంగీకరించకపోవడంతో నిరసనగా టిడిపి కార్పొరేటర్ శ్రీరాం ప్రసాద్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
నగరపాలక సంస్థల పరిధిలో రానున్న కాలంలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమావేశం ఆమోదం తెలిపింది. అనేక డోర్ నంబర్లతో సతమతమవుతున్న నగర ప్రజలకు ఒకే డోర్ నంబర్ కేటాయింపునకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
తొలుత నగరంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని పలువురు కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. దీనిపై తీవ్రస్థాయిలో గలాభా జరిగింది. వాహనాలకు డీజిలు వినియోగంపై అక్రమాలు జరుగుతున్నాయని డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు ఆరోపించారు. ఈ అంశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కొండారెడ్డికి వజ్రబాబుకు వాగ్వావాదం జరిగింది. పారిశుధ్య నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని మేయర్ కమిషనర్‌ను కోరారు. సమగ్ర పారిశుధ్య పనుల నిర్వహణకు కార్మికుల రేషనలైజేషన్, పనిముట్ల అందజేతకు ఆమోదం, తక్షణం అదనపు సూపర్ వైజర్ల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. వార్డుల వారీగా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల, సెక్రటరీల వివరాలను కార్పొరేటర్లకు మేయర్ కోరారు. ఇందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ తెలిపారు. చెత్త తొలగించకపోవడంతో తమ వార్డుల్లో ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, మహమూద్, రోషన్, మల్లపు రమ్య, బూసిరాజలత, ఈచంపాటి ఆచారి, పడాల సుబ్బారెడ్డి, శ్రీరాం ప్రసాద్ ఆరోపించారు. జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచాలని కోరారు. అందుకు తగ్గట్లుగానే ఉన్నారని వీరిని పూర్తిస్థాయిలో వినియోగించాలని డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు అన్నారు.
విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణపైనా తీవ్ర గలభా చోటుచేసుకుంది. ఈ అంశంలో విద్యుత్‌శాఖ డిఈఈ శ్రీనివాసబాబు చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. తాము ఎంజారు చేయడానికి సమావేశానికి వచ్చారని విద్యుత్ శాఖ డిఈఈ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ క్షమాపణ చెప్పాలని కార్పొరేటర్లు ఈచంపాటి, అచ్చాల వెంకటరెడ్డి తదితరులు పట్టుబట్టారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తాను ఒక పదం వాడబోయి మరో పదం వాడానని క్షమాపణ చెప్పారు. వీధి దీపాల నిర్వహణకు ఒక డిఈఈ, ఇద్దరు ఏఈలను ప్రత్యేకంగా నియమించాలని మేయర్ సూచనలను కమిషనర్ ఆమోదించారు.
హోర్డింగ్‌ల నిర్వహణలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని కార్పొరేటర్లు రోషన్, అచ్చాల వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఒక హోర్డింగ్‌కు అనుమతి తీసుకుని వంద ఏర్పాటు చేసుకుంటున్నారని, కార్పొరేషన్‌కు రూ.100 చెల్లించి రూ.లక్ష సంపాదిస్తున్నారని ఆరోపించారు. అనధికారిక హోర్డింగ్‌లపై చర్యలు లేవని దుయ్యబట్టారు. క్యూఆర్ కోడ్ విధానం ఇంకా అమలు చేయలేదన్నారు. హోర్డింగ్ ఏజెన్సీలు ఇస్తున్న సొమ్ము కార్పొరేషన్‌కు జమ అవుతుందా? లేదా? అని ప్రశ్నించారు. వారిచ్చిన చెక్కులు చెల్లుబాటు అయ్యాయా? అని నిలదీశారు. అక్రమాలను నిరోధించేందుకు క్యూఆర్ కోడ్ విధానం త్వరలో అమలు చేస్తామని కమిషనర్ కీర్తి తెలిపారు. వీరు చెల్లిస్తున్న సొమ్ముపైనా పక్కా ఆడిట్ చేయిస్తామన్నారు.
లక్ష్మీపురం బస్బే పై అంతస్తులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అచ్చాలవెంకట రెడ్డి ఆరోపించారు. ఈ బస్బే, కాలపరిమితి ముగిసిన బస్బే స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని కమిషనర్ కీర్తి తెలిపారు.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ క్రిస్మస్ మాసం సందర్భంగా నగరంలోని చర్చీల పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని కోరారు. అంబేద్కర్ భవన్, గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాల్స్ అభివృద్దికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయని, కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం రావడంలేదని కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి చెప్పారు. పందుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లు కోరారు. ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, ముస్తాఫా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఎకౌంటెంట్పై కేసు
గుంటూరు కార్పొరేషన్లో ఇప్పటి వరకు అధికారులు నిర్ధారించిన మేరకు రూ.47.09 లక్షలు స్వాహా చేసిన అంశంలో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై గత నెల రోజులుగా అధికారులు పట్టించుకోవడం లేదని ఈనెల 28వ తేదీన 'లక్షలు మింగేసినా మీనమేషాలు' శీర్షికతో ప్రచురితమైన వార్తకు కమిషనర్ స్పందించారు. వెంటనే పోలీసులు కోరిన వివరాలిచ్చి కేసు నమోదు చేయించాలని ఎగ్జామినర్‌ను ఆదేశించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఎగ్జామినర్ జె.నాగేంద్ర కుమార్ లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ గన్నవరపు అంజయ్య కేసు నమోదు చేశారు. సెక్షన్ 408, 420, 477-ఎ ఐపిసి కింద కేసు నమోదు చేశారు. ఎకౌంట్స్ విభాగంలో పనిచేసిన ఎస్.సిరిల్పాల్ను ప్రధాన నిందితుడుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. నగర పాలక సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు చెల్లించాల్సిన సొమ్మును దారి మళ్లించి స్వాహా చేయడంలో సిరిల్‌పాల్ బాధ్యుడని ఎగ్జామినర్ నాగేంద్రకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.