
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు దీక్షకు ప్రకృతే పరీక్షలు మానుకుంది
మంచు తుంపరలు ముత్యాల అక్షింతలై దీవించాయి
అకాల వర్షపు జల్లులు వొంగి నమస్కరించి విజయోస్తు అన్నాయి
ఎటొచ్చీ కమలం ఖట్టర్ ప్రభుత్వమే కెమ్లాలో
లాఠీలూ జలఫిరంగులతో దాడి వడుపు చూపింది
తలలు బద్దులు కొట్టి రక్తపు ధారల వారు పోయించుకుంది
అయితేనేం ప్రకృతితో పోరాడి పొలాన్ని జయించిన ధీశాలి
బరి దాటకుండా గురి తప్పకుండా
నల్ల చట్టాల పెంట పోగులు తట్టలకెత్తి దిబ్బలలో పోశాకే
గడప తొక్కుతానూ ఇంటి తలుపు తడతానూ అంటూ
ఢిల్లీ పక్క గల్లీల్లో దట్టీ బిగించి నిలిచిన తీరుకు
నిఖిల లోకం హర్షం వర్షించి జేజేలు పలికింది!
పంట దోచుకోమనీ, పొలం లాగేసుకోమనీ
ఏ రైతూ ఎవరికీ కాళ్ళకూ మొక్కలేదు
గోదాముల్లో నిల్వల పోగులు పోసి
ధరలు దొరల దయకొదలమనీ అడగనూ లేదు
మధ్యలో హస్తిన రాజుల దులే బలపడినట్టుంది
మొండికేసిన ఎద్దు మూడు చట్టాలపై నుంచి లేవలేదు
కదలని మొండితనంపై కోర్టే హార్ట్ బ్రేక్ చేసింది
అడగని చట్టాల కలుపు తీస్తారా? తీయమంటారా అని హూంకరించి
తుదకు చట్టాల పాముల చుట్టలు బుట్టలో పెట్టింది
కొట్టే కర్రను అటకపై నుంచి దించకుండా వదిలేసింది
గజం మిథ్య న్యాయం కాదు, రద్దే హద్దనడంతో
ఏలే వాడికిపుడు రెండే తోవలు
రైతు అల్టిమేటంకు తల వంచడం
లేదా రణ క్షేత్రంలోకి రైతును దించడం
మొండికేస్తే ఏదో ఒక గండం ఎదురవక తప్పదు
అడ్డొచ్చిన దుక్కిని దున్నేయడం
కాడి దాటిన ఎద్దుల గాడిన పెట్టడం
రైతుకు చెర్నాకోల, ముల్లుగర్రతో పెట్టిన విద్య
ఇది బడి చదువు కాదు, పొలం చదువు
ఇంకా తోలు మందం పాలనతో
మూడు చట్టాల ముళ్ళకంప తీయకుంటే
ఖాకీల క్రౌర్యాలను పొలాలో గుచ్చి
లాఠీల వాటం రూటు మార్చడంతో పాటు
నీటి ఫిరంగుల జల తరంగాలను
సేద్యానికి పారుదలగా మళ్ళించడం నేర్చిన తరం
ఢిల్లీ గల్లీల్లో చట్టాల్లో లొట్టలు తవ్వి ప్రశ్నల నాట్లేస్తుంది
ఇటు పోరాటం అటు హక్కుల అంకుశంతో
పాలక కుట్రలకు ముకుతాడు సిద్ధం చేసింది
తస్మాత్ జాగ్రత్త ! ఖబడ్దార్ అనక ముందే
తెలివి తెచ్చుకో, తోక వంక సరిచేసుకో !
- ఉన్నం వెంకటేశ్వర్లు
83328 07330