Jan 13,2021 16:05

విశాఖ : విశాఖ ఏజెన్సీ దారాలమ్మ ఘాట్‌ రోడ్‌ లో దారి దోపిడీ దొంగల అరాచకం రోజురోజుకీ పెరిగిపోతుంది. ప్రయాణికులను టార్గెట్‌ చేసుకొని వారిపై దాడి చేసి దొంగతనాలు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ జీకేవీధి మండల కేంద్రం నుంచి సీలేరు వరకు ఉన్న 50 కిలోమీటర్ల ఘాట్‌ రోడ్‌ లో అత్యంత ప్రమాదకరమైన అడవి ప్రాంతం కావడంతో గడిచిన కొద్ది రోజులుగా కొందరు దుండగులు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న పర్యాటక కార్లను, వాహనాలను అడ్డగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
        ఇటీవల.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సీలేరు నుంచి గూడెం కొత్తవీధికి కారులో కొందరు వ్యక్తులు వెళ్తున్న సమయంలో 12 గంటలకు దారాలమ్మ తల్లి ఆలయ రెండవ ఘాట్‌ రోడ్డు వద్ద రోడ్డుకి అడ్డంగా బండరాళ్లు ఉన్నాయి. కార్లలో ఉన్న వ్యక్తులు ఆ బండరాళ్లను చూసి ఆగేసరికి రోడ్డుకు రెండు వైపులా అప్పటికే మాటు వేసుకొని ఉన్న దొంగలు ఒక్కసారిగా కారుపై దాడికి దిగారు. ఇద్దరు వ్యక్తుల వద్ద నాటు తుపాకీలు కూడా ఉన్నాయని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు తెలిపారు. వారి వల్ల ముప్పు ఉందని గమనించి కారులో ఉన్న వ్యక్తులు వేగంగా కారుని తిప్పుకొని వచ్చేసరికి ఇనప రాడ్లతో కారు అద్దాలను పగులగొట్టారు. ఆ సమయంలో ఓ వ్యక్తికి గాయాలయినట్లు సమాచారం. కార్‌ లో ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నట్లుగా సమాచారం. గడిచిన వారం రోజుల్లో అదే ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు రెండు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.