
ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా రెండో రోజైన సోమవారం జలబిందెల మహోత్సవం కన్నుల పండువగా సాగింది. ముందుగా ఆలయ పురోహితులు ఆంజనేయ శర్మ, వేద పండితులు కిరణ్ శర్మ లక్ష్మణ్ శర్మ దిలీప్ కుమార్ శర్మ, అర్చకులు రమణల ఆధ్వర్యంలో నూతనంగా తీసుకువచ్చిన ఐదు మట్టి కుండల్లో మున్నేరు జలాలను నింపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి లీలా కుమార్, చైర్మన్ చెన్న కేశవరావు పాల్గొన్నారు. అనంతరం ఆచార సంప్రదాయాలలో భాగంగా గ్రామానికి చెందిన ఐదు కులాలకు చెందిన కర్ల సతీష్ , సూరంపల్లి చైతన్య, వడ్లమూడి మధుసూదన్‌రావు, నల్లపునేని రామారావు, గజ్జి శివకృష్ణ ఈ జలబిందెలను శిరస్సుపై పెట్టుకోగా సిఐ నాగ మురళి, ఎస్‌ఐ, సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ కుమారి, తహసీల్దార్ లక్ష్మి కళ్యాణి పాల్గొన్నారు.