
- అసెంబ్లీలో తీర్మానం దారుణం
ప్రజాశక్తి - అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : బోయ/వాల్మీకిలను గిరిజన జాబితాలో చేర్చాలని చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చితే సహించేది లేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఖండిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని గిరిజనులకు ఆయన పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసం బోయ/వాల్మీకిలను ఎస్‌టిల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం దారుణమన్నారు. ఆయన గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని పేర్కొన్నారు. రాయలసీమలోని 40 లక్షల జనాభా కలిగిన బోయ/వాల్మీకిలు నాన్ షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తూ బిసి-ఎ జాబితాలో ఉన్నారన్నారు. వారికి ఎటువంటి ప్రత్యేక భాష, ఆచారాలు, సంప్రదాయాలూ లేవని తెలిపారు. డాక్టర్ బిఎన్ లోకూరు కమిషన్ నివేదిక ప్రకారం బోయ/వాల్మీకిలను గిరిజన జాబితాలో చేర్చేందుకు అర్హత లేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్‌రెడ్డి ప్రయతిుస్తున్నారని, గతంలో టిడిపి ప్రభుత్వం కూడా వారిని గిరిజన జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అసలైన గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.