Sep 27,2021 15:28

పనాజి :  గోవాలో 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ నేత లుయిజిన్హో ఫలిరో సోమవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. గోవా మాజీ ముఖ్యమంత్రిగా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో త్రిపుర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా, విధులు నిర్వహించారు. ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)లో చేరనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. కాగా, రాజీనామాకు ముందు ఫలిరో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ మాత్రమే మోడీకి గట్టిపోటీని ఇవ్వగలరని, ఆమె రాజకీయ యోధురాలని అన్నారు. ఆమె తనదైన ప్రణాళికతో పశ్చిమబెంగాల్‌లో గెలుపు సాధించారని ప్రశంసించారు. టిఎంసిలో చేరనున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తాను దీర్ఘకాలం కాంగ్రెస్‌లోనే.. కాంగ్రెస్‌ కుటుంబంగానే కొనసాగుతానని.. అయితే బిజెపిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పోరాడగలదని మాత్రమే సూచించానని అన్నారు. బెంగాల్‌లో మోడీ 200 బహిరంగ సభలు, అమిత్‌షా 250 సభలు నిర్వహించారని, సిబిఐ, ఇడిలతో దాడులు చేయించారని .. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయంసాధించారని అన్నారు. టిఎంసి సిద్ధాంతాలు, ప్రణాళికలు, కార్యకలాపాలు కలిగిన అటువంటి యోధులే ప్రస్తుతం కావాలని, అన్ని పార్టీలు ఏకమై బిజెపిని ఓడించాలని అన్నారు.