
న్యూఢిల్లీ : చెన్నై వాసి ఢిల్లీకి వెళ్లానుకున్నా.. హైదరాబాదీ అమృత్‌సర్ చుట్టేయాలనుకున్నా.. ఎవరో ఒకరు తెలిసిన వాళ్లు ఉండాలి లేదా ఓ గైడ్‌ను పెట్టుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని. అక్కడ వెళ్లాక... ఓ ప్రాంతానికి వెళ్లాలనుకుంటే గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయిస్తాం. అంతేగా.. కానీ ఓ వీధిలోకి వెళ్లాలనుకుంటే.. ఎవరినో ఒకరిని అడుగుతాం. కానీ మెహమాటం అడ్డువస్తుంటోంది. ఇప్పుడు వాటన్నింటికీ టాటా చెప్పేందుకు గూగుల్ మ్యాప్ సరికొత్త అవతారాన్ని ఎత్తింది. గూగుల్ మ్యాప్‌లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇందులో నగరాల్లో వీధులను చాలా క్షుణ్ణంగా వీక్షించవచ్చు. ఈ ఫీచర్ వల్ల వీధులను వీక్షించడమే కాదు నావిగేట్ చేస్తోంది. దీంతో ప్రయాణం మరింత సౌకర్యం కానుందన్న మాట. 2016లో పూర్తి స్థాయిలో ఈ ఫ్యూచర్ అందుబాటులోకి రావాల్సి ఉండగా.. భద్రతా కారణాలుగా పేర్కొంటూ.. అప్పుడు కేంద్రం తిరస్కరించింది. ఎట్టకేలకు ఇప్పుడు భారత్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని గూగుల్ బుధవారం వెల్లడించింది. ఇది జెనెసిస్, టెక్ మహీంద్ర సహకారంతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. 360 డిగ్రీల కోణంలో కూడిన చిత్రాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం దేశంలోని 10 నగరాలకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్ నగర్, అమృత్‌సర్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాలకు ఈ ఫీచర్‌ను తీసుకురావాలని సంస్థ భావిస్తోంది.