Aug 19,2022 09:26

కొలంబో : శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడిన ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో ఆ దేశం నుండి పరారైన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అమెరికాలో తిరిగి స్థిరపడేందుకు గ్రీన్‌ కార్డ్‌ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య, కుమారుడితో అక్కడ స్థిరపడేందుకు సిద్ధమౌతున్నారని శ్రీలంక వార్తా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. రాజపక్సే భార్య లోమా అమెరికా సిటిజన్‌ కావడంతో రాజపక్సే గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నందున, దీనికి సంబంధించిన ప్రక్రియను అగ్రరాజ్యంలోని రాజపక్సే న్యాయవాదులు గతనెలలోనే ప్రారంభించారని కొన్ని ఆధారాలను బట్టి శ్రీలంక వార్తా పత్రిక డైలీ మిర్రర్‌ పేర్కొంది. 2019లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజపక్సే తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. 1998లో అమెరికాకు వలస వెళ్లే ముందు శ్రీలంక సైన్యం నుండి ముందస్తు పదవీ విరమణ పొందిన ఆయన.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోకి వెళ్లారు. 2005లో శ్రీలంకకు తిరిగి వచ్చారు. ఈ ప్రక్రియలో ఇప్పుడు కొలంబోలోని ఆయన న్యాయవాదులు అదనపు పత్రాలను ఇక్కడ సమర్పించే అవకాశాలున్నాయని ఆ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం తన భార్యతో కలిసి బ్యాంకాక్‌ హోటల్‌లో ఉన్న ఆయన.. థారులాండ్‌లో ఉండాలన్న ప్రణాళిక రద్దు చేసుకుని, ఆగస్టు 25న శ్రీలంకకు తిరిగి వస్తారని పేర్కొంది.